ముగిసిన రాహుల్-చంద్రబాబు భేటీ, మీడియాతో రాహుల్ ఏమన్నారంటే…

Rahul and chandrababu
- Advertisement -

Rahul and chandrababu

అమరావతి: ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి భేటీ ముగిసింది. సుమారు గంటపాటు ఇద్దరి నడుమ ఈ సమావేశం జరిగింది. అనంతరం.. రాహుల్, చంద్రబాబు మీడియా ముందుకొచ్చారు.

- Advertisement -

తొలుత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశం బాగా జరిగిందని అన్నారు. తాము గతం జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నామని, వర్తమానం, భవిష్యత్తు గురించి మాత్రమే మాట్లాడదలచుకున్నామని చెప్పారు.

కలిసి పనిచేస్తాం…

దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనుకున్నామని, దీనికోసం భావసారూప్యత గల పార్టీలతో కలిసి పనిచేస్తామని, తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లడమే ముఖ్యమని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలన్నీ కలిసి నడవాల్సిన సమయం వచ్చిందని, తమ భవిష్యత్ కార్యాచరణను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు.

రాఫెల్ కుంభకోణంపై స్పందిస్తూ…

ఈ సందర్భంగా రాఫెల్ కుంభకోణం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ… రాఫెల్ కుంభకోణం గురించి ప్రజలందరికీ తెలుసునని, ఈ ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సరైన విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకొస్తాయని అన్నారు. రాఫెల్ కుంభకోణంపై దర్యాప్తు జరపాల్సిన సంస్థలపై దాడి జరుగుతోందని విమర్శించారు.

మీడియాకు ఉన్న ఇబ్బందులు కూడా తెలుసు..

రాజ్యాంగ సంస్థలపై జరిగే దాడిని ఆపడమే తమ ఉమ్మడి లక్ష్యమని స్పష్టం చేశారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, బీజేపీ కుంభకోణాలపై ఉద్యమిస్తామని రాహుల్ చెప్పారు. అలాగే మోడీ నుంచి మీడియాకు ఉన్న కొన్ని ఇబ్బందులను కూడా తాను అర్థం చేసుకోగలనని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -