ఎక్కడా ‘ఫ్రెండ్లీ ప్రభుత్వం’? గ్రీవెన్స్ సెల్‌లో ఇదీ పరిస్థితి…

12:49 pm, Sun, 7 July 19
ap-cm-ys-jagan
‘‘మీరేం చేస్తారో నాకు తెలియదు.. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు.. ప్రజలు మీ దగ్గరకు ఎటువంటి పని కోసమైనా రానివ్వండి.. వారు ఎంత ఆవేశంగానైనా మాట్లాడనివ్వండి.. కానీ మీరెక్కడా కూడా సంయమనం కోల్పోకూడదు..  మీరు ప్రజలతో స్నేహభావంతో ఉండాలి.. మనది ఒక ఫ్రెండ్లీ ఫ్రభుత్వమనే భావన రాష్ట్ర ప్రజల్లో కలగాలి. అది ఎంత స్వచ్ఛంగా ఉండాలంటే.. కాల్గేట్ టూత్ పేస్ట్ ప్రకటనలో.. ఆ నవ్వు కనిపించినంత స్వచ్ఛంగా ఉండాలి..’’ 

ఇది ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి.. దిశానిర్దేశం..

మరి ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిని పాటిస్తున్నారా? వారి తీరు అలాగే ఉందా? సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పినట్లుగా అన్నిచోట్లా అమలవుతుందా? దీనిపై ‘న్యూస్ ఎక్సెప్రెస్’ అందిస్తోన్న ప్రత్యేక కథనం.

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే నెలరోజులు దాటింది. ఆయన తన ప్రభుత్వం ఎలా ఉండాలన్నదానిపై  ఇటు ప్రజాప్రతినిధులకు, అటు అధికారులకు దిశా నిర్దేశం చేసి..ఆ ప్రకారం నడుచుకోకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పకనే చెప్పారు. అందులో ఆయన ప్రధానంగా చెప్పిన మాటేమిటంటే..

‘ఫ్రెండ్లీ ప్రభుత్వం..’

ఈ కాన్సెప్ట్ గురించి ఆయన ప్రజాప్రతినిధులకు చెప్పారు. అలాగే అధికారులకూ చెప్పారు. కానీ అమలు విషయానికి వచ్చేసరికి ఇది అంత ఆచరణ సాధ్యం కావడం లేదనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఎంతో ఆశగా వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలను ఆయా స్థాయిల్లో అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం సహజంగా జరిగేదే..

కానీ ముఖ్యమంత్రి జగన్ ఏం చెప్పారంటే.. మీరెన్ని రోజుల్లో పని కంప్లీట్ చేస్తారో ఒక కాగితంపై రాయండి.. మూడు రోజులు, వారం, పదిహేను, నెల.. ఎన్నిరోజులైనా కానివ్వండి.. కానీ ఆ చెప్పిన సమయానికి.. తిరిగి మళ్లీ లబ్ధిదారుడుగాని, ఫిర్యాదుదారుగాని వస్తే.. రిజల్ట్ కనిపించాలి. కారణం చెప్పడం కాదు.. ఫలితం కావాలి..

అంతిమంగా అతనికి న్యాయం జరగాలి..

అది మళ్లీ పొరపాటున నా టేబుల్ పైకి వస్తే మాత్రం.. నాకు బాధితులు చెప్పింది కరెక్టు అనిపిస్తే మాత్రం.. తప్పనిసరిగా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్లు నా దగ్గరకు రాలేని పరిస్థితి ఉంటే.. నేనే రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. అక్కడికి వచ్చినపుడు చెబితే..అక్కడే దానికి పదిమందిలో మీరు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అధికారుల తప్పు లేకపోతే ఫర్వాలేదు. కానీ వాళ్లు.. మా  పార్టీ వారైనా సరే.. ఆ కారణంగా చేశామని చెబితే..

సంబంధిత ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

అందుకే మరీ ముఖ్యంగా అధికారులకన్నా..ఎక్కువ మా వాళ్లకే చెబుతున్నాను. ఇలాంటి ప్రజా వ్యతిరేక పనులన్నీ నాయకుల పైరవీల వల్లే జరుగుతాయి. ఇన్ని తలనొప్పులు ఉంటాయి కాబట్టే.. ఎవరికి వారు ఎవరి స్థాయిల్లో వారు మీ నాయకులని కనిపెట్టుకుని ఉండాలి.

అలాగే అధికారులు కూడా.. 175 సీట్లలో.. 150 మంది ఎమ్మెల్యేలను మనకు ప్రజలు అందించారు. అలాగే 22 మంది ఎంపీలను ఇచ్చారు. ఇలా అక్కడా ఇక్కడా కూడా ఆశీర్వదించారు. దానిని మనం నిలబెట్టుకోవాలి. 2024 మిషన్ లక్ష్యంగా పనిచేయాలి.

మళ్లీ అప్పుడు మనం గెలవలేని పరిస్థితులు కల్పించుకోవద్దు. ప్రజలు మనపై పెట్టిన విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇది నా సింగిల్ పాయింట్ ఎజెండా అంటూ సీఎం జగన్ అందరికీ ఒక సందేశమైతే పంపించారు.

కానీ ఆచరణలోకి వచ్చేసరికి అదంత ఈజీగా లేదు.

ముఖ్యంగా సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్ లో ప్రజా సమస్యలపై అధికారులు విసుక్కుంటున్నారనే విమర్శలున్నాయి. చిన్న సమస్యయినా కావచ్చు..పెద్దదైనా కావచ్చు.. ఆ చెప్పే సమాధానం ప్రజల మనసు గాయపడేలా చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఉన్నతాధికారులు చూసి .. పక్క సెక్షన్లకి పంపిస్తే వాళ్లు దురుసుగా ప్రవర్తించడం.. ఒకవైపు  ముఖ్యమంత్రి ఇలాగంటుంటే..వీరేంటి ఇలా మాట్లాడుతున్నారనుకోవడం ప్రజల వంతవుతోంది.

దీనికి ముఖ్యకారణం…

అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకోవడం వల్ల.. అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయలేక అలా అంటున్నారనే విమర్శలున్నాయి. కాకపోతే కొన్నిచోట్ల చోటామోటా నేతలు.. హడావుడి ఎక్కువగా ఉందనే విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి.

అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కాకినాడ కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ సెల్‌లో సీఎం చెప్పిన ఫ్రెండ్లీ ప్రభుత్వం తరహా విధానం గతంలో కనిపిస్తోదని పలువురు పేర్కొంటున్నారు. ఇక్కడ కలెక్టర్‌గా కార్తికేయ మిశ్రా పనిచేసిన సమయంలో.. వివిధ సమస్యలు, ఫిర్యాదులపై వచ్చే బాధితుల పట్ల ఆయన ఎంతో ఆదరణ చూపించే వారట.

అంతేకాదు, ఆయన అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించేవారని, అలాగే పెద్దవాళ్లని ఎంతో ప్రేమగా పలకరించేవారని ఇప్పటికీ అందరూ చెప్పుకుంటారు. దీంతో కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే ప్రజలందరూ ఎంతో సంతృప్తిగా వెనుదిరిగేవారట.. 

ఇప్పుడు కూడా రాష్ట్రమంతా అధికారులు ఇదే తరహా గనుక అనుసరిస్తే.. అదే ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రజలు అంటున్నారు. 

అందువల్ల ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి.. ఈ ’ఫ్రెండ్లీ ప్రభుత్వం‘ కాన్సెప్ట్‌పై ఒకసారి దృష్టి సారించాలని, దీని ఆచరణ అన్ని జిల్లాల్లో ఎలా ఉందో పరిశీలించి తగు సూచనలు ఇస్తేబాగుంటుందని ప్రజలందరూ కోరుతున్నారు.

– శ్రీనివాస్ మిర్తిపాటి