ఎక్కడికెళుతోంది?.. దేశం ఏమైపోతోంది? హిమశైల శిఖరానికా.. పాతాళ కుహరానికా…

4:21 pm, Thu, 4 April 19
common-man-sitting-lonely

మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది?  ఏమిటి ఈ అర్థం లేని ఎన్నికల హామీలు?  వీటికి ఒక సమాధానం చెప్పే వ్యవస్థ లేదా?రాజ్యాంగంలో ఓటరుకు రక్షణ లేదా? హామీలకు చట్టబద్ధత కల్పించలేరా..?

బెంగళూరుకు చెందిన ఓ సామాన్యుడు కేంద్ర ఎన్నికల సంఘానికి సంధించిన లేఖాస్త్రం! 

కాకినాడ: ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా, ఊకదంపుడుగా ఇచ్చే హామీలన్నీ ఎలా నెరవేరుస్తారు? ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ నుంచి తెస్తారు? ఎలా తెస్తారు? ఎలా ఇస్తారు? అసలు మన కొత్త ఆంధ్రప్రదేశ్‌లో స్థూల ఆదాయమెంత? మన ఖర్చులెంత? మన రాబడి ఎంత? అసలు మన స్టేట్ బడ్జెట్ ఎంత?

సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా.. అధికారమే పరమావధిగా చేసుకుంటూ.. మాయమాటలు చెబుతూ.. ఇలా అధికారపీఠం ఎక్కిన తర్వాత.. ఓట్లేసిన అమాయక ప్రజలకు.. పాలకుల నుంచి మన భారత రాజ్యాంగంలో రక్షణ లేదా? ఆ హామీలకు చట్టబద్ధత కల్పించలేరా? అంటూ బెంగుళూరుకు చెందిన ఒక కామన్ మేన్ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు..

వివరాల్లోకి వస్తే…

తెలుగుదేశం, వైసీపీ పార్టీలు.. నువ్వింతంటే..ఇదిగో నేనంత ఇస్తా.. అంటున్నారు. ఇందమ్మా.. అంటే అందమ్మా అంటున్నారు. ‘నేనంటే నేనే’ అంటూ ఒకరిని మించి ఒకరు అలవికాని హామీలిస్తూ ప్రజలను మభ్యపెట్టి మాయ చేస్తున్నారు. నేలమీద నడవనివ్వడం లేదు. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు.. ఏమిటిదంతా అని ఓ సామాన్యుడు ప్రశ్నిస్తే.. ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ నుంచి ఆయనకు సమాధానం వచ్చింది.

ఇది మీ ఆంధ్రప్రదేశ్.. అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయండి.. అని దాని సారాంశం..

బహుశా ప్రధానమంత్రి మోడీ, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ఇచ్చే హామీలు వారి పరిధిలో లేనట్టుంది.. ఇంకా చెప్పాలంటే ఇది భారతదేశ సమస్యగా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి  అనిపించలేదు కాబోలు.. అందుకే ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నికల సంఘం అధికారులకు రాయమన్నారు. దాంతో వారు చెప్పినట్టే పాపం ఆ కామన్ మేన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

అయితే వారి దగ్గర నుంచి ఇంకా సమాధానం రాలేదు..

అప్పుడు ఆయనకి మన వ్యవస్థపై ఉన్న నమ్మకం పోయి.. ఒక సందేహం కూడా వచ్చింది.. ఇదయ్యే విషయం కాదు.. అనుకుంటూ నిజంగా ఇవన్నీ ఇస్తే వ్యవస్థ అతలాకుతలమైపోతుంది.. ఇంత అరాచకం జరుగుతుంటే మనమేం చేయలేమా? అని ఒక మాటన్నారు.

అదే ఈ కథనం..

ఒక్కసారి అన్న ఎన్టీఆర్ పాట విందాం..

‘‘నా దేశం… భగవద్గీత

నా దేశం… అగ్నిపునీత సీత

నా దేశం… కరుణాంతరంగ

నా దేశం… సంస్కార గంగ ’’

ఎక్కడికెళుతుంది దేశం.. ఏమైపోతుంది..

హిమశైల శిఖరం పైకా..పాతాళ కుహరంలోకా..

’బంగారుమనిషి‘ చిత్రంలోని అన్నఎన్టీఆర్ పాట ఒకసారి యూట్యూబ్ లో దయచేసి వినండి..ఎందుకంటే సాహిత్యం రాస్తే..ఆ పాటలో ఉన్న  భావోద్వేగం, ఆ ఇన్సిపిరేషన్ మీకు కనిపించదు. ఎంతో అత్యద్భుతంగా ఎస్పీబాలు, సుశీల పాడటం విశేషం..

ఈ పాట ఆఖరి పల్లవిలో.. ఈ వాక్యం కూడా అందరూ తప్పక చదవాలి.

‘‘రాహువు పట్టిందా.. జాతికి రక్తం చచ్చిందా…

ఇప్పటికైనా ఈ దేశం తన తప్పు తెలుసుకోవాలి… రానున్న ముప్పు తెలుసుకోవాలి..’’

ఇది 1974లో వచ్చిన పాట..  డాక్టర్ సి.నారాయణరెడ్డిగారు రాసినది..  ఇప్పటికి 45 సంవత్సరాలైంది..

ఇంకా కొంత ముందుకు వెళితే…

1961లో వచ్చిన ‘వెలుగు-నీడలు’ చిత్రంలో పాట చూడండి..  ఈ పాట వచ్చి 58 సంవత్సరాలైంది.. ఇది శ్రీశీగారు రాసిన పాట..

పాడవోయి భారతీయుడా..
ఆడిపాడవోయి విజయగీతికా…
పాడవోయి భారతీయుడా…
ఆకాశం అందుకునే ధరలొకవైపు..
అదుపులేని నిరుద్యోగమింకొక వైపు..
అవినీతి, బంధుప్రీతి చీకటిబజారు
అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు..
కాంచవోయి నేటి దుస్థితి..ఎదిరించవోయి ఈ పరిస్థితి…   
పాడవోయి భారతీయుడా…
పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు..
ప్రతి మనిషి మరియొకని దోచుకునేవాడే..
తన సౌఖ్యం..తన భాగ్యం చూసుకునేవాడే..
స్వార్థమీయ అనర్థకారణం.. అది తెంచుకొనుటే ప్రేమదాయకం… 
పాడవోయి భారతీయుడా…

అంటే దగ్గర దగ్గర 58 ఏళ్ల క్రితం సమస్యలెలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే ఉన్నాయి.

అదే బంధుప్రీతి, అదే చీకటి బజారు, అవే అధిక ధరలు, అవే కులమత భేదాలు, అవే భాషాద్వేషాలు..ఇప్పటికి పక్కనోడిని ఎలా దోచుకుందామనే తప్ప..వాడికి సాయం చేసేవాడే లేడు. అంటే ఇద్దరు అన్నలు ఎన్టీఆర్ పాటైనా..ఏఎన్నాఆర్ పాటైనా అప్పటికి, ఇప్పటికి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి..

హామీల దౌర్భాగ్యం.. ఒక్క భారతదేశ సమస్యే కాదు.. ప్రపంచ దేశాల సమస్య

స్వాతంత్రం వచ్చి 72 ఏళ్లయ్యింది..నాటి ప్రధాని నెహ్రూగారి నుంచి నేటి మోదీ వరకు హామీలిచ్చే ఎన్నికలకు వెళుతున్నారు. ఇది మన దేశ సమస్యే కాదు..ప్రపంచ సమస్య అని కూడా చెప్పాలి.. ఎందుకంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో ఈ హామీల దౌర్భాగ్యం ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా జరిగే ఎన్నికల్లో కూడా వాళ్లు హామీలిచ్చే ఓట్లు అడుగుతారు.

అంత టెక్నాలజీలో ముందుండే వారికి కూడా బహుశా మరో మార్గం కనిపించలేదనుకుంటా.. అయితే అక్కడికి..ఇక్కడికి తేడా ఏమిటంటే.. వాళ్లు సాధ్యమయ్యే హామలే ఇస్తారు. ఇక్కడ మనవాళ్లు సాధ్యం కానివి ఇస్తారు. అదే తేడా..

అందుకే ఏం జరుగుతుంది..ఏం జరుగుతుంది..అని బాధపడాల్సిన అవసరం లేదనుకుంటా..ఎందుకంటే వీళ్లిప్పుడు చెప్పే అలవికానీ హామీలన్నీ ఇచ్చేవి కావు..చచ్చేవి కావు..ఇంతకుముందు తీర్చారనా..వీటిని తీర్చడానికి..అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

బహుశా ఎన్నికల కమిషన్ ఇవన్నీ గమనించే మరో మార్గం లేకే ఆ సామాన్యుడి లేఖను ఇటు ఏపీకి తోసేసినట్టుంది..

ఇక చివరిగా చెప్పాలంటే ఇది నాయకుల తప్పు కాదు.,
ఎన్నికల కమిషన్ తప్పు కాదు..
రాజకీయ పార్టీల తప్పు కాదు..

ఒకరిది ఉంది.

వాళ్లే కళ్లు తెరవాలి.. వాళ్లలోనే చైతన్యం రావాలి..  అందుకే ఈ కథనం ముగించే ముందు..  ఒక్కసారి ఈ పాట యూట్యూబ్ లో వినండి. లేదంటే  రాసిన సాహిత్యమైనా చదవండి…
1993లో వచ్చిన ‘గాయం’ చిత్రంలో పాట చూడండి..  ఇది సిరివెన్నెల రాసిన గీతం. ఈ పాట వచ్చి 26 సంవత్సరాలైంది..  ఆ పాటేమిటంటే..

 

నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు..ఈ సమాజ జీవచ్ఛవాన్ని…

మారదు లోకం.. మారదు  కాలం..
దేవుడు దిగిరానీ..ఎవ్వరు ఏమైపోనీ..
మారదు లోకం…మారదు కాలం..
 
గాలివాటు గమనానికి.. కాలిబాట దేనికి..
గొర్రెధాటు మందకి..నీ జ్నానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది..పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది..చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా..రావణకాష్టం
కృష్ణగీత ఆర్పిందా… నిత్య కురుక్షేత్రం
 
పాతరాతి గుహలు.. పాలరాతి గృహాలైనా..
అడవి నీతిమారిందా.. ఎన్ని యుగాలైనా..
వేట అదే వేటు అదే.. నాటి కథే అంతా..
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండా..
శతాబ్ధాలు చదవలేద.. ఈ అరణ్యకాండ..      

నిగ్గదీసి అడుగు.. సిగ్గు లేని జనాన్ని

నిప్పుతోటి కడుగు.. ఈ సమాజ జీవచ్ఛావాన్ని…

పాట చూశారు కదా.. అందుకే మనం ఎవరిని అడగాలి.. ఎవరు ఆలోచించాలి. ఓటేసే జనం ఆలోచించాలి.

ఏది మంచో.. ఏది చెడో  ఆ ఓటరే ఆలోచించాలి.
తన ఇంట్లో ఒక సమస్య వస్తే.. ఏది మంచో, ఏది చెడో తెలుసుకోలేని మనిషి ఈ దేశంలో ఎవరున్నారు?
తన పిల్లవాడిని ఏ స్కూలులో జాయిన్ చేయాలి?
ఎంసెట్ ర్యాంకు వస్తే ఏ ప్రైవేటు ఇంజనీరింగు కాలేజీలో చేర్చాలి?
అమెరికా పంపించాలంటే.. ఏ యూనివర్శిటీలో చదివించాలి?
మెడిసిన్ లో ఎంత ర్యాంకు వస్తే.. ఏ జిల్లాలో ఏ కాలేజీలో సీటు వస్తుంది?
జ్వరం వస్తే ఏ డాక్టరు దగ్గరికి వెళితే తక్కువ ఫీజుతో బయటపడవచ్చు
మార్కెటుకి వెళితే కూరగాయలు ఎక్కడ తక్కువకి వస్తాయి?
రైతు బజారులోనా.. రోడ్డుమీదా, ఇంటికొచ్చే సైకిల్ అబ్బాయి దగ్గరా?
పెళ్లి చేసుకునేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు, స్థలం కొనేటప్పుడు..బండి కొనేటప్పుడు, ఊరెళ్లాలంటే ట్రైన్ ఎక్కేటప్పుడు,
బస్సు ఎక్కేటప్పుడు.. పెళ్లి చేయాలంటే పంతులు దగ్గర నుంచి వండి వడ్డించేవారి వరకు..
అన్నీ మంచి చెడులు చూసి నిర్ణయాలు తీసుకునే జనం..
ఐదేళ్లు మనల్ని, నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని..
ఇలా ప్రజలసొమ్ముని పప్పన్నంలా భోంచేస్తున్నావారిలో 
ఎవరు మంచి, ఎవరు చెడు తెలుసుకోలేని అజ్నానులు ఉన్నారంటే
సీతారామశాస్త్రిగారి ’గాయం‘ చిత్రంలో గేయంలాగే ఉంటుంది. 
నిజానికి ఆ చిత్రం పేరు గాయం..అది హీరో కుటుంబానికి తగిలిన గాయం కాదు.. ఈ సమాజానికి తగిలిన గాయం..
అదీ కాన్సెప్ట్..

వాట్సాప్ లలో, సోషల్ మీడియాల్లో, ఫేస్ బుక్కుల్లో పోస్టులు పెట్టడం లైక్ లు కొట్టడం కాదు..నీకు నిఖార్సయిన నాయకుడు దొరక్కపోతే నోటా ఓటు ఉంది..అక్కడ నొక్కండి.. వాడు మంచివాడైతే మీ ఓటు అతనికే వేయండి..అతను ఓడిపోయినా ఫర్వాలేదు. కానీ మీ ఓటు గెలుస్తుంది. ప్రజాస్వామ్యం నిలుస్తుంది.

నువ్వు ఇలా నిఖార్సుగా ఓటుకి నోటుకి లొంగకుండా నిలబడితే రేపు నీకొడుకు నిలబడతాడు. ఆ తర్వాత వాడి కొడుకు నిలబడతాడు. ఈ తరానికి కాకపోయినా తర్వాత తరమైనా బాగుపడుతుంది. నువ్వొక పార్టీ రక్తం, కులం రక్తం, మతం రక్తం అన్నీ నీ వారసుడికి ఎక్కిస్తే ఏ పాజిటివ్, బీ నెగిటివ్, ఓ పాజిటివ్ ఇవన్నీ కలిసిపోతున్నాయి.

ముందు వాటిని ఆపండి.. అన్నీ అవే ఆగిపోతాయి.. అప్పుడు వచ్చే నినాదం ఏమిటో తెలుసా…

సత్యమేవ జయతే.. సర్వే జనా సుఖినోభవంతు…

జైహింద్

– శ్రీనివాస్ మిర్తిపాటి