పవన్ కళ్యాణ్‌కు షాక్: జనసేనకు యర్రా నవీన్ గుడ్‌బై, స్వార్థ రాజకీయ పార్టీయేనంటూ..

3:27 pm, Thu, 14 March 19
Yerra Navven resigns to Janasena Party, Newsxpressonline

పశ్చిమగోదావరి: తొలి జాబితా ప్రకటించగానే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో ముసలం మొదలైంది. జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కోకన్వీనర్ యర్రా నవీన్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తితో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.

ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారంటూ అధినేతపై మండిపడ్డారు. ఇతర పార్టీల్లో టికెట్లు రాని వారు జనసేనలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు.

చదవండి: జనసేన తొలి జాబితా విడుదల: 4 పార్లమెంటు, 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు వీరే…

పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో రాజీనామా చేసినట్టు యర్రా నవీన్ వెల్లడించారు. పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారని, కానీ అలా జరగలేదని వాపోయారు.

జనసేన కూడా స్వార్థ రాజకీయ పార్టీనే..

తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ కనీసం జనసేన పార్టీ కార్యాలయంలో అప్లికేషన్ కూడా పెట్టలేదని యర్రా నవీన్ వెల్లడించారు. దరఖాస్తులు చాలా వచ్చాయని చెప్పుకోవడం కాదు.. అప్లికేషన్ పెట్టిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. తనకు టిక్కెట్‌ ఇవ్వకపోయినా కష్టపడిన వారికి ఇచ్చి ఉంటే చాలా సంతోషించేవాడినని అన్నారు.

‘‘పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చే పార్టీలోకి వచ్చా. జనసేన పార్టీ అన్ని పార్టీల లాంటిది కాదని అనుకున్నా. కానీ ఇది కూడా స్వార్ధ రాజకీయ పార్టీయేనని తేలిపోయింది. నా రాజీనామాతో అయినా మళ్లీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూస్తారనే రాజీనామా చేస్తున్నా. అభిమానుల అభిప్రాయంతో తదుపరి కార్యాచరణ రెండురోజుల్లో ప్రకటిస్తా..’’అని యర్రా నవీన్ స్పష్టం చేశారు.

ఇది ఇలావుంటే, గురువారం సాయంత్రం రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈసభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పవన్ కళ్యాణ్ పూరించనున్నారు. ఈ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు భారీ ఎత్తున జనసైనికులు తరలిరానున్నారు.