నిన్న ప్రచారం ..నేడు మరణం…వైసీపీ అభిమానుల్లో తీవ్ర విషాదం!

8:07 am, Fri, 15 March 19
YS-Vivekananda-Reddy

 కడప:దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ సోదరుడు, వైసీపీ అధినేత జగన్ కి సొంత బాబాయ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలో తన ఇంటిలోనే తుదిశ్వాస విడిచారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. వైఎస్సార్‌కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిన్నతమ్ముడైన వివేకకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు

1989,1994లలో పులివెందుల నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.1999,2004 లలో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. చాల సౌమ్యునిగా పేరున్న వ్యక్తి వైఎస్‌ వివేకానందరెడ్డి. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తుంది.

ఈ సమయంలో సీనియర్ నాయకులైన వైఎస్‌. వివేకానంద రెడ్డి వైఎస్ కుటుంబం జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణ వార్త వినగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు. వైఎస్ సోదరుడిగా, జగన్ బాబాయ్ గా వివేకానందరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతో చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆయనకు కుడి భుజంగా మెలిగారు. వైఎస్‌. వివేకానంద రెడ్డి మరణ వార్త విన్న వైఎస్ జగన్ శోక సంద్రంలో మునిగిపోయారు. అన్నకు అండగా నిలబడిన నేతగా వివేకా ఎంతో పేరు తెచ్చుకున్నారు.

ఇపుడు ఆ అన్న కొడుకు జగన్ రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని, దాన్ని తాను కళ్ళారా చూడాలనై వివేకా ఎంతో ఆరాటపడ్డారు. వివేకాకు కడప ఎంపీ సీటు వైసీపీ ఇస్తుందని కూడా ప్రచారం జరిగింది. అలాగే రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆయన వదిన విజయమ్మ పై పోటీ కి దిగడం ఆ సమయలో ఒక సంచలనం అయ్యింది. ఆ ఎన్నికల్లో విజయమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆ ఎన్నికల్లో వదిన పై పోటీ చేయడానికి ఇష్టం లేకున్నా కూడా పార్టీ ఆదేశాల మేరకు పోటీకి దిగాడు. అనంతరం కొన్ని రోజులకి విభేదాలకు స్వస్తి పలికి కుటుంబానికి దగ్గరయ్యారు. జగన్ స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఏపీలో అధికారంలోకి రాబోతుంది అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా ఏంటికి పెద్ద దిక్కుని కోల్పోవడం జగన్ కి తీరని లోటు అని చెప్పవచ్చు.

వైసీపీ తరపున ఆయన పులివెందులలో నిన్న ప్రచారం కూడా చేసారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడం అందరిని శోకసంద్రంలో ముంచింది. కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ కుటుంబ అభిమానుల్లో విషాదఛాయలు నింపింది.