‘‘నువ్వు , నీ మాటలు చూస్తుంటే అచ్చు కేఏ పాల్ బ్రదర్‌లా ఉన్నావే…’’

3:07 pm, Sat, 23 March 19
Pavan Kalyan Latest News, KA Paul Latest News, AP Political News, Newsxpressonline

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాకతో పాటు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, భీమవరంలో పవన్ ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తనపై జనసేనాని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చారు.

భీమవరం మురికికూపంగా మార్చేశారంటూ పవన్ తనపై ఆరోపణలు చేయడాన్ని గ్రంథి తప్పుబట్టారు. పూటకో మాట మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, ఎన్నికలకు ముందే జనసేన పార్టీని టీడీపీలో కలిపిస్తే జనాల్లో ఓ క్లారిటీ వస్తుందని ఎద్దేవా చేశారు.

‘‘అసలు, మీ బాడీ లాంగ్వేజి, మీ మాటలు చూస్తుంటే కేఏ పాల్‌కు మీకు తేడా కనిపించడం లేదు, ఇద్దరూ అన్నదమ్ముల్లాగే ఉన్నారు..’’ అంటూ సెటైర్ వేశారు.

‘‘పవన్ ఓటమి తథ్యం..’’

ఈ ఎన్నికల్లో పవన్ ఓటమిపాలవడం తథ్యమని, ఆయన ముందే నామినేషన్ ఉపసంహరించుకుంటే కనీసం పరువైనా మిగులుతుందని సూచించారు. పవన్ లా దిగుజారుడు రాజకీయాలు చేసే నేత మరొకరు ఉండరని విమర్శించారు. ప్రత్యేకహోదా ఏమైనా సంజీవనా? అన్న చంద్రబాబుతో పవన్ చేతులు కలిపి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

పవన్ ఊసరవెల్లిలాంటివాడని పేర్కొన్న గ్రంథి శ్రీనివాస్, తాను భీమవరం ఎమ్మెల్యేగా ఐదేళ్లపాటు పనిచేశానని, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే, పవన్ ఇప్పుడొచ్చి భీమవరాన్ని మురికికూపం చేశారంటూ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు.

పవన్ స్నేహితుడు గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు రామాంజనేయులు ఇక్కడ పదేళ్లు ఎమ్మెల్యేగా వ్యవహరించినా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని, మరి పవన్ ఆయననెందుకు విమర్శించరని గ్రంథి ప్రశ్నించారు.