ప్రత్యేక హోదా కోసం మరో యువకుడు బలిదానం, ‘ప్రాణాలు తీసుకోవద్దు.. కలిసి పోరాడదాం..’: వైఎస్ జగన్

chittoor-sudhakar-suicide-specia-status
- Advertisement -

chittoor-sudhakar-suicide-specia-status

చిత్తూరు : ప్రత్యేక హోదా కోసం మరొక యువకుడు బలిదానం చేశాడు.మదనపల్లె రామరావు కాలనీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్(26) శనివారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి సుధాకర్‌ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేయడం చిత్తూరు జిల్లాలో ఇది రెండో సంఘటన. గతంలో మునుకోటి అనే వ్యక్తి తిరుపతిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన కార్యక్రమంలో సుధాకర్‌ చురుకుగా పాల్గొనేవాడని స్థానికులు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన చేనేత కార్మికుల సమావేశంలో కూడా సుధాకర్‌ తన గళాన్ని వినిపించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అంతేకాదు, నిరుపేద అయినప్పటికి సుధాకర్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని, తాను నివాసం ఉంటున్న కాలనీకి సమీపంలో ఉన్న ఓ అనాథశ్రమానికి ఇటీవల రూ. 5 వేలు విరాళం కూడా ఇచ్చాడని స్థానికులు తెలిపారు.  మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సుధాకర్‌ ఆత్మహత్య చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హోదా కోసమే సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.

ప్రభుత్వాస్పతి వద్ద ఉద్రిక్తత..

సుధాకర్‌ మృతి పట్ల ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆందోళనకు దిగడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రికత్త నెలకొంది. సుధాకర్‌ మృతితోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున నాయకులు, విద్యార్థులు పాల్గొనడంతో రవాణా స్తంభించిపోయింది. సుధాకర్ కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి పరామర్శించారు. సుధాకర్‌ కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున రూ.2 లక్షలు సహాయం అందించారు.

రేపు మదనపల్లె బంద్‌… 

ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన సుధాకర్‌ మృతికి సంతాపంగా రేపు(ఆదివారం) మదనపల్లె బంద్‌కు వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు పిలుపునిచ్చాయి.

ys-jagan-mohan-reddyప్రాణాలు తీసుకోకండి.. కలిసి పోరాడదాం: వైఎస్ జగన్ పిలుపు

ప్రత్యేక హోదా కోసం తొందరపడి ఎవరూ ప్రాణాలు తీసుకోరాదని, అందరం కలిసి పోరాడి సాధించుకుందామని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పాదయాత్ర చేస్తున్న జగన్ చిత్తురు జిల్లా మదనపల్లిలో చేనేత కార్మికుడు సుధాకర్‌ ఆత్మహత్య చేసుకోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన సధాకర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. పోరాడి ప్రత్యేకహోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు.

- Advertisement -