‘అయ్యా యాక్టర్ గారూ.. పార్ట్‌నర్ గారూ..’: పవన్‌ కళ్యాణ్‌కు జగన్ సూటి ప్రశ్న

4:37 pm, Thu, 28 March 19
YS Jagan Latest News, Pavan Kalyan Latest News, ys jagan slams pawan kalyan News, Newsxpressonline

పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పేరును ప్రస్తావించకుండా ఆయన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గురువారం పాలకొల్లు సభలో ఆయన మాట్లాడారు.

‘’అయ్యా యాక్టర్ గారూ… అయ్యా పార్టనర్ గారూ… మా చిన్నాన్నగారికి జరిగినట్టుగానే మీ ఇంట్లో జరిగి.. ఆ తరువాత ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి.. మీ బంధువులే ఆ పని చేశారు.. మీరే ఆ పని చేశారు అని ఆరోపిస్తే మీకు నచ్చుతుందా? అప్పుడు కూడా ఇలానే మాట్లాడతారా..?’ అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఐదేళ్లుగా ఏపీలో జరుగుతోన్న అవినీతిపై నోరు మెదపని ఆయన.. నన్ను మాత్రం విమర్శిస్తున్నారంటూ జనసేనానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘’2014 ఎన్నికల్లో టీడీపీకి ఓటేయమని చెప్పి ఈ పార్టనర్ గారే ఓటేయించారు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు చేసిన ప్రతి అన్యాయంలోనూ, ప్రతి మోసంలోనూ ఈ పార్టనర్ అక్కడే ఉన్నారు..’ అని జగన్ విమర్శించారు.

అంతేకాదు, ‘‘పార్టనర్‌ గారు నామినేషన్‌ వేయడానికి వెళ్తే అక్కడ కనిపించేవి టీడీపీ జెండాలు.. ఐదేళ్లు పాలన చేసిన చంద్రబాబు మోసాలపై, అన్యాయాలపై, అక్రమాలపై పార్టనర్‌ మాట్లాడరు. ఎప్పుడూ మాట్లాడినా జగన్‌.. జగన్‌.. అంటూ ఉంటారు. ఈ కుట్రలను గమనించమని ప్రజలను కోరుతున్నా. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి..’’ అని వైఎస్ జగన్ అన్నారు. 

అలాగే ‘‘ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకొస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి..’’ అని జగన్ పిలుపునిచ్చారు.

‘‘మా ప్రభుత్వం రాగానే.. ఆ రూ.3 లక్షలు మేమే ఇస్తాం…’’

లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే వాటిని పేదవారు చెల్లించాలా? అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంకులపాడులో చంద్రబాబు కడుతున్న ఫ్లాటు తీసుకున్న వారిపై 3 లక్షల రూపాయల అదనపు భారాన్ని మోపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాదు, రూ.3 లక్షలు కూడా దాటని ఫ్లాట్లను చంద్రబాబు పేదలకు రూ.6 లక్షలకు అమ్ముతున్నారని, అందులో లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం, లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, మిగిలిన రూ.3 లక్షలు అప్పుగా రాసుకుంటున్నారని, ఆ మొత్తాన్ని పేదవారు 20 ఏళ్ల పాటు నెలకు రూ.3 వేల చొప్పున కట్టాలని అంటున్నారని జగన్ చెప్పారు.

మరి లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే.. ఆ మొత్తాన్ని పేదవారు చెల్లించాలా? అని ప్రశ్నించారు. పేదవారికి ఆ కష్టం రానివ్వమని, చంద్రబాబు ఇచ్చిన ఫ్లాట్లను తీసుకున్న వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 3 లక్షల రూపాయలను మాఫీ చేస్తుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.