ప్రమాణ స్వీకార వేదికపై జగన్ భావోద్వేగం.. కంటతడి పెట్టిన విజయమ్మ

5:06 pm, Thu, 30 May 19
ys-jagan-emotional-speach-ys-vijayamma-got-tears

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వేదికపై ఉద్విగ్నభరిత క్షణాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ తన ప్రసంగంలో తన తల్లిదండ్రులను ప్రస్తావిస్తూ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

ఆ సమయంలో వేదికపైనే కూర్చుని ఉన్న ఆయన తల్లి వైఎస్ విజయమ్మ లేచి జగన్ దగ్గరికి వచ్చి అతడ్ని హృదయానికి హత్తుకున్నారు. జగన్ కూడా తన తల్లిని ఓదార్చారు. ఇది చూసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలు, పలువురు ప్రజలు కూడా భావోద్వేగానికి గురయ్యారు. 

తల్లిదండ్రులను తలుచుకుని… 

గవర్నర్ నరసింహన్ తన చేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం వైఎస్ జగన్ తొలి సంతకం చేశారు. అనంతరం తనకు ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జగన్ తలచుకున్నారు.

ఆయన ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు ఆకాశమంతటి విజయం అందించిన ప్రజలకు జగన్ పాదాభివందనం చేశారు. అనంతరం తనకు జన్మనిచ్చిన పైన ఉన్న తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తల్లి వైయస్ విజయమ్మకు పాదాభివందనం అని చెప్పారు.

దీంతో వేదికపై కూర్చుని ఉన్న ఆయన తల్లి విజయమ్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లి పరిస్థితి చూసి జగన్ కూడా చలించిపోయారు. జగన్‌ను హత్తకుని వైఎస్ విజయమ్మ ఆనందంతో పరవశించిపోయారు. ఆనంద బాష్పాలతో కన్నీటి పర్యంతమయ్యారు.

జగన్ కూడా తీవ్ర భావోద్వేగంతో తల్లి కన్నీటిని తుడిచి ఆమెను ఓదార్చారు. ఈ వేదికపై ఈ దృశ్యాలను చూసిన ప్రజలు, కార్యకర్తలు పలువురు భావోద్వేగానికి గురై కళ్లు తుడుచుకున్నారు.