పులివెందులలో నామినేషన్‌ వేసిన వైఎస్‌ జగన్‌!

3:35 pm, Fri, 22 March 19
YS Jagan's nomination in Pulivendula News, Jagan Mohan reddy Latest News, Newsxpressonline

పులివెందుల: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో.. సరిగ్గా మధ్యాహ్నం 1.49 గంటలకు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

ఈ నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు ఆయన సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. జగన్ నామినేషన్‌ ర్యాలీకి వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పులివెందుల వీధులన్నీ జనసంద్రమయ్యాయి. అంతకుముందు పులివెందుల సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నానని కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన గడ్డ పులివెందుల అన్నారు.

తన బాబాయి వివేకానందరెడ్డిని దారుణంగా చంపించారని ఆరోపించారు జగన్. హత్య చేసి వాళ్లు పోలీసులతోనే విచారణ చేయిస్తున్నారని, కడప జిల్లాలో గెలవలేమని టీడీపీ నిర్ధారించుకుందని తెలిపారు. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని.. అందుకే కుట్రలకు తెరలేపారని జగన్ ఆరోపించారు.