జగన్ అదే విషయం చెప్పమన్నాడు, అందుకే వచ్చా: విజయమ్మ

4:12 pm, Sat, 30 March 19
Vijayamma Campaigning Latest News, YS jagan Latest News, Newsxpressonline

ప్రకాశం: జిల్లాలోని ఎర్రగొండపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జిల్లా అభివృద్ధికి ఒక్క అడుగైనా పడిందా? అని నిలదీశారు. వెలిగొండ ప్రాజెక్టును కావాలనే నిర్లక్ష్యం చేశారని, జిల్లాకు 16సార్లు వచ్చిన చంద్రబాబు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని జగన్ హామినిచ్చాడని.. అదే విషయం చెప్పమని తనను పంపించాడని విజయమ్మ తెలిపారు. జగన్ కోసం ఇవాళ గడప దాటాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో మీ అందరికీ తెలుసని ఆమె అన్నారు. ఓట్లడగడానికి జగన్ అమ్మ, చెల్లి వస్తోందని టీడీపీ నాయకులు వెటకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

‘మీకోసం కష్టపడుతున్న జగన్‌ను ఆశీర్వదించమని అడిగేందుకు వచ్చాను. మీ అమూల్యమైన ఓట్లని ఫ్యాన్ గుర్తుకు వేయండి. వైఎస్‌ జగన్‌ని ముఖ్యమంత్రిని చేయండి. 25 మంది ఎంపీ సీట్లను గెలిపించి ప్రత్యేక హోదా సాధించేలా జగన్‌ని ఆశీర్వదించండి. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా అధిమూలపు సురేష్‌ని, ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలిపించండి’ అని ఓటర్లకు విజయమ్మ పిలుపునిచ్చారు.

చంద్రబాబుకు ఓటేసీ మళ్లీ మోసపోవద్దు..

‘మీ భవిష్యత్తు నా బాధ్యత అని చంద్రబాబు అంటున్నారు. ఇన్నాళ్లూ ఏం బాధ్యత తీసుకున్నారు. గత ఎన్నికల్లో కూడా మీ భద్రత నాది అన్నారు. అక్క చెల్లెళ్లారా.. మీకు భద్రత ఉందా. రైతులకు రుణమాఫీ చేశానని చంద్రబాబు అబధ్ధాలు చెప్తుతున్నారు. ఆరోగ్య శ్రీ బిల్లులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ పూర్తి ఆరోగ్య భద్రత కల్పిస్తాం. 108 సేవల్ని బలోపేతం చేస్తాం’ అని విజయమ్మ వ్యాఖ్యానించారు.

అంతేకగా, ‘ఫీజు రీయంబర్స్‌మెంట్‌ జరగకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమ్మఒడి పథకం కింద పిల్లల్ని బడికి పంపే తల్లులుకి రూ.15000 అందిస్తాం. విద్యార్థులకు వసతి గృహ ఖర్చులకు రూ. 20 వేలు చెల్లిస్తాం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం. డ్వాక్రా రుణాలు నాలుగు దఫాలుగా మాఫీ చేస్తాం. 2.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 72 గంటల్లోపే ప్రజాసేవలన్నీ గ్రామ సచివాలయం ద్వారా అందేలా చూస్తాం’ అని విజయమ్మ భరోసా ఇచ్చారు.

చంద్రబాబు విలువలు లేని వ్యక్తి.. ఆయనకు ఓట్లడిగే హక్కు లేదని విజయమ్మ మండిపడ్డారు.
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చింది. ప్రజల కోసం ఎందాకైనా పోరాటం చేసే తత్వం నా భర్తది. వైఎస్‌ జగన్‌ రాజకీయ విలువలు కలిగిన వ్యక్తి. నా బిడ్డ తాపత్రయం ప్రజల సంక్షేమమే. జగన్‌ ప్రజల పక్షాన నిలబడటం నచ్చని చంద్రబాబు నా బిడ్డను ఎయిర్‌పోర్టులో అంతం చేయాలనుకున్నారు’ అని మండిపడ్డారు. జనం కోసం వస్తున్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.