వైఎస్ వివేకానంద‌ రెడ్డిది హత్యే.. శరీరంపై ఏడు కత్తిపోట్లు!

3:52 pm, Fri, 15 March 19
YS Vivekananda Reddy's murder! Seven stabbed on the body!, Newsxpressonline

కడప: వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం మిస్టరీగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున పులివెందులలోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో మరణించినట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న తమ్ముడిగా రాజకీయాలలో ఆయనకి వైఎస్ వివేకానంద రెడ్డి చేదోడు వాదోడుగా ఉన్నారు. అలాగే రెండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వివేకా, పార్లమెంట్ సభ్యులుగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు.

సహజ మరణం కాదా..?

అయితే మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై గాయం ఉండటం, చనిపోయిన సమయంలో వివేకానంద రెడ్డి ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని కృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

మరోవైపు వివేకానందరెడ్డి భౌతికకాయానికి కొద్దిసేపటి క్రితమే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించారు. గురువారం ప్రచారం ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసిన తర్వాత ఒక్కరే ఇంట్లో ఉన్నారని తెలుస్తోంది.

అయితే శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వివేకానంద రెడ్డి బాత్‌రూంలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని పని వారు గుర్తించారు. బెడ్‌‌రూమ్‌లో ఏసీ ఉన్నప్పటికీ డోర్‌ ఎందుకు ఓపెన్‌ చేసి ఉంది? సైడ్‌ డోర్‌ లాక్‌ ఎవరు తీశారు? అనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. 

మరోవైపు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, వైయస్ వివేకానందరెడ్డి మృతిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా, వైఎస్ వివేకానంద రెడ్డి మరణంపై అవినాశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబ పెద్ద దిక్కు, పెద్దనాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది.  ఆయనది సహజ మరణం కాదు. పెద్దనాన్న మరణం పట్ల మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన మృతిపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టాలి..’’ అని డిమాండ్‌ చేశారు.

దీంతో వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానం క్షణ క్షణానికి పెరిగిపోతోంది. అలాగే పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కూడా వివేకానంద రెడ్డిది హత్యే అని ప్రాథమిక నిర్ధారణకి వచ్చిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది ఉంది.