వైఎస్ వివేకానంద రెడ్డి రాజకీయ ప్రస్థానం!

10:26 am, Fri, 15 March 19
YS Vivekananda Reddy's political career

కడప: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించడంతో వైఎస్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పులివెందులతో పాటు కడప జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వివేకానంద రెడ్డి, తన అన్నరాజశేఖర్‌రెడ్డికి అన్ని అంశాల్లో కుడిభుజంలా వ్యవహరించారు.

వైఎస్ అడుగుజాడల్లో రాజకీయంగా ఓనమాలు దిద్దిన ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా సేవలందించారు. 1989లో తొలిసారి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేకానందరెడ్డి 1994 ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు.

వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు…

ఆ తరువాత 1999, 2004లో కడప లోక్‌సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో లక్షా 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది వివేకానందరెడ్డి సంచలనం సృష్టించారు. 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు.

ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత, కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు వివేకా ఆయనతో విభేదించారు. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఆ సమయంలో జగన్‌ కుటుంబానికి కొద్దిరోజులు దూరంగా ఉన్నారు.

ఆ సమయంలోనే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరపున తన వదిన విజయమ్మపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆపై కొన్ని రోజులు రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు. తర్వాత కొద్దికాలానికి బాబాయ్-అబ్బాయ్ కలిసిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన పార్టీ ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కడప జిల్లాలో లింగాల కాలువను వివేకానందరెడ్డి డిజైన్ చేశారు.