అదుపుతప్పి లారీని ఢీకొన్న వైఎస్ షర్మిల ప్రచార రథం.. ఒకరి మృతి

11:46 am, Thu, 11 April 19

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రచార రథ అదుపుతప్పి లారీని ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూ జిల్లా మర్రిపాడు మండలంలోని కృష్ణాపురంలో జరిగిందీ ఘటన. షర్మిల విజయవాడలో ప్రచారాన్ని ముగించుకుని పులివెందుల వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

షర్మిల ప్రచార రథం అదుపు తప్పి వేగంగా వెళ్లి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెకు చెందిన డ్రైవర్‌ నగిరి సంజీవనాయుడు (52) ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో షర్మిల లేరని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.