సామాజిక కార్యకర్త నాయుడు నాగార్జునరెడ్డిపై వైసీపీ నేత ఆమంచి వర్గీయుల దాడి.. పరిస్థితి విషమం

8:03 am, Tue, 24 September 19

చీరాల: వైసీపీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులుగా భావిస్తున్న వారి చేతిలో గాయపడిన సామాజిక కార్యకర్త నాయుడు నాగార్జునరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమంచి అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలను బయటపెట్టాడని నాగార్జునరెడ్డిపై కృష్ణమోహన్, ఆయన అనుచరులు కక్ష పెంచుకున్నట్టు తెలిసింది.

సమయం కోసం ఎదురుచూస్తున్న వారికి నాగార్జున నిన్న చిక్కాడు. అతడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి చితకబాదారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇచ్చి వస్తుండగా నాగార్జునను అడ్డుకున్న ఆమంచి అనుచరులు దాడిచేసి చావబాదారు. గతంలోనూ నాగార్జునరెడ్డిపై దాడి జరిగింది. అప్పట్లో ఆయన కాలును విరగ్గొట్టారు.

తాజాగా, జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమంచి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలపై నాగార్జునరెడ్డి కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసినట్టు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.  అప్పటి నుంచి నాగార్జున కోసం ఎదురుచూస్తున్న ఆమంచి అనుచరులు సోమవారం దొరకడంతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు.  

తన భర్తపై అన్యాయంగా దాడిచేసిన వారిని, అందుకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుడు నాగార్జునరెడ్డి భార్య జ్యోతి డిమాండ్‌ చేశారు. గాయపడిన భర్తను చూచి ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆమె కోరారు.