రోజూ ఎక్కడికని దేవాన్ష్ అడుగుతున్నాడు.. అందుకే తీసుకొచ్చా: చంద్రబాబు

5:28 pm, Sun, 7 April 19
nandigama-chandrababu-devansh

అమరావతి: కృష్ణా జిల్లా నందిగామలో ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సభలో చంద్రబాబు కోడలు బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు.

సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రోజూ ఎక్కడికెళుతున్నావు తాతయ్యా అని దేవాన్ష్ తనను అడుగుతున్నాడని, తానెంత కష్ట పడుతున్నానో తన మనవడికి తెలియాలనే ఈ రోజు ఎన్నికల ప్రచారసభకు తీసుకొచ్చానని చెప్పారు.

చదవండి: పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై మాటల తూటాలు పేల్చిన వైఎస్ షర్మిల!

ఈ సందర్భంగా.. రాష్ట్రంలోని పిల్లలందరూ తనకు మనవళ్లేనని… వారి బాగోగులు చూసుకోవడం తన బాధ్యతని అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని తల్లిదండ్రులందరూ తమ బిడ్డలను పనికి కాకుండా బడికి పంపాలని బాబు సూచించారు.

జగన్ క్వాలిఫికేషన్‌పై బాబు సెటైర్లు…

తాను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశానని, మరి వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఏం చదివాడో అతడికే తెలియదంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.

గతంలో ఒకసారి ఎంబీఏ చదివానని చెప్పిన జగన్ ఆ తరువాత బీకాం చదివినట్లు చెప్పాడన్నారు. ఇక ప్రధాని మోడీ అయితే.. ఆయన ఏ యూనివర్సిటీలో చదివారో కూడా చెప్పలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

చదవండి: కొంతమంది సన్నాసులు ఏపీపై పగబట్టారు: శివాజీ సంచలన వ్యాఖ్యలు!

‘‘పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తా. మీ పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లు చేసే బాధ్యత నాది. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం రూ.20 లక్షలు ఇస్తా. ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు ఇస్తా..’ అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర యువత ప్రపంచానికే సేవలందించే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.