ముసుగులో గుద్దులాటలొద్దు: ఎస్పీవై రెడ్డికి చంద్రబాబు బంపర్ ఆఫర్

6:54 am, Wed, 27 March 19
chandrababu naidu

కర్నూలు: ముసుగులో గుద్దులాటలు వద్దని.. దమ్ముంటే నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్న రెడ్డిలు ముసుగులు తొలగించి రావాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. అప్పుడే వారికి తమ తడాఖా ఏమిటో చూపిస్తామని చంద్రబాబు అన్నారు. నంద్యాల రోడ్ షోలో ఆయన మాట్లాడారు.

ముగ్గురు దుర్మార్గులతో తాను పోరాడుతున్నానని అన్నారు. రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని… ఆయన ఢీ అంటే తాము కూడా ఢీ అంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీకి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. వ్యాపారం, వ్యవసాయం చేసి జగన్ సంపాదించారా? అని అడిగారు. వైసీపీ ఖర్చు చేస్తున్నదంతా దొంగ డబ్బులని, కేసీఆర్ పంపిన డబ్బు అని విమర్శించారు.

ఎస్పీవై రెడ్డికి బంపర్ ఆఫర్

ఇటీవల జనసేనలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డికి ఈ సందర్భంగా చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నంద్యాలలో టీడీపీ గెలుపుకు ఎస్పీవై రెడ్డి సహకరించాలని.. అలాగైతే, ఆయన కుటుంబానికి గౌరవప్రదంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి ఆస్తులపై కావాలనే ఐటీ దాడులు చేయించారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

నంద్యాలను జిల్లా చేస్తా..

ఎన్నికలు అయిపోయిన వెంటనే నంద్యాలను ప్రత్యేక జిల్లా చేస్తానని, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. నంద్యాలకు ఔటర్ రింగ్ రోడ్డును వేస్తామని చెప్పారు. నంద్యాలను గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. కుప్పం కంటే కూడా ఇక్కడి టీడీపీ అభ్యర్థికి ఎక్కువ మెజార్టీ రావాలని పిలుపునిచ్చారు.

చదవండి: మీ కుటుంబాలే రాజకీయాలు చేయాలా?: నారా, వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్