‘‘లోకేష్ మాత్రమే కాదు.. ఒక్క టీడీపీ మంత్రి కూడా గెలవడు.. కావాలంటే రాసిస్తా..’’

6:15 pm, Wed, 17 April 19
comedian-prudhvi-on-lokesh

హైదరాబాద్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్‌కు, ఫలితాల వెల్లడికి నడుమ 41 రోజుల గ్యాప్ ఉండడంతో.. త్రిముఖ పోరులో ఏ పార్టీ గెలుపు సాధిస్తుంది? ఏపీకి కాబోయే సీఎం ఎవరు? అనే విషయాలపై తీవ్ర ఉత్కంఠ రాజ్యమేలుతోంది.

మరోవైపు టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన.. మూడు పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ప్రజలు తిరిగి తమనే ఎన్నుకోబోతున్నారని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంటే.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కచ్చితంగా తమ పార్టీయే గెలుస్తుందని వైసీపీ గట్టి నమ్మకంతో ఉంది.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే.. కాబోయే సీఎం తానేనంటూ ప్రకటించేశారు కూడా.

థర్టీ ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు…

అయితే ఈ లెక్కలన్నీ ఇలా ఉండగా.. వైసీపీ నేత, నటుడు, కమెడియన్ థర్టీ ఇయర్స్ పృథ్వీ మాత్రం ఈసారి రాష్ట్రంలో కచ్చితంగా వైసీపీయే అధికారంలోకి వస్తుందంటూ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళగిరిలో చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ గెలిచే సమస్యే లేదన్నారు కమెడియన్ పృథ్వీ. అంతేకాదు, అసలు ప్రస్తుత టీడీపీకి చెందిన 18 మంది మంత్రులలో ఒక్కరు కూడా గెలవరంటూ జోస్యం చెప్పేశారాయన.

‘‘నేను ఈరోజు చెబుతున్న మాటలు రాసి పెట్టుకోండి. టీడీపీ మంత్రుల్లో ఎవరూ గెలవరు.. చివరికి నారా లోకేష్‌తో సహా. కావాలంటే ఫలితాలు వెలువడ్డాక నన్ను ప్రశ్నించండి..’’ అని పృథ్వీ వ్యాఖ్యానించారు.

అంతేకాదు, ‘‘మొన్న వాళ్లు ఢిల్లీకి వచ్చారు. ఒక్కరి ఫేస్‌లో కూడా కళ లేదు. టెక్కలి అచ్చెన్నాయుడైతే నవ్వలేక నవ్వాడు. మన పని అయిపోయింది.. ఇక మనమేం చేయలేం అని వాళ్లకి అర్థమైపోయింది..’’ అన్నారు.

‘‘టీడీపీ వాళ్లకి భయం పట్టుకుంది. ఆ భయంతోనే వాళ్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా 130 సీట్లు వాళ్లకి వస్తాయనే నమ్మకమే ఉంటే.. మరి వాళ్ల ముఖాల్లో భయమెందుకు? అని పృథ్వీ ప్రశ్నించారు.

మంగళగిరిలో లోకేష్‌పై పోటీ చేసిన ఆర్కే రియల్ హీరో అని కమెడియన్ పృథ్వీ వ్యాఖ్యానించారు. తాను మంగళగిరిలో ప్రచారం చేస్తున్న సమయంలో చాలామందిని అడిగానని, అందరూ ఆర్కే కావాలనే చెప్పారని, పైగా ప్రభుత్వం మాకు అన్నీ ఇస్తోందికానీ.. ఓటు మాత్రం ఆర్కేకే వేస్తామని చెప్పారని పేర్కొన్నారు.