తుని బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా.. ప్రజా వైద్యశాల డాక్టర్ పాండురంగారావు

12:48 pm, Sat, 23 March 19
Dr. Panduranga Rao Latest News, Congress Latest News, Tuni Updates, Newsxpressonline

ఒక డాక్టర్ దగ్గరకెళితే… వంద నుంచి ఐదు వందల రూపాయల వరకు ముక్కు పిండి ఫీజు వసూలు చేస్తారు. అదే తుని పట్టణంలో ప్రజావైద్యశాలకు వస్తే కేవలం ఐదు రూపాయలే..

ప్రజాసేవలో అలుపెరగని పేదవాళ్ల డాక్టరుగారు.. ఆయన పేరు.. చిలుకోటి పాండురంగారావు. నేడు తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్నారు. ఒక్కసారి మరి ఆ పేదవాళ్ల డాక్టరు గారి గురించి తెలుసుకుందామా…

ఏదైనా చిన్నపాటి అనారోగ్యమొస్తే.. తుని నియోజకవర్గంలో ప్రజలకు చటుక్కున గుర్తుకువచ్చే పేరు..  ప్రజావైద్యశాల డాక్టరుగారు..మనసులో మరో ఆలోచన లేకుండా పరుగులు పెట్టే జనం.. ఏమంటున్నారంటే.. మేం ఆపదలో ఉంటే ప్రాణాలు కాపాడి ఆదుకునే మహానుభావుడు..ఆ డాక్టరు బాబు.. ఈసారి మాకు రుణం తీర్చుకునే సమయం వచ్చింది.  తప్పకుండా సార్ కే ఓటు వేసి..

ఆయనను గెలిపించుకుంటాం. మాకెంతో మంచి చేసే డాక్టర్ గారు గెలిస్తే.. ఇంకా మంచి పనులు చేసి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం అంటున్నారు..ఇంత ప్రజాభిమానాన్ని పొందిన ఆ ప్రజావైద్యశాల,  ఆ పేద ప్రజల డాక్టర్ పాండురంగారావు గారి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఆ  వివరాల్లోకి వెళితే…

వైద్యవృత్తి అంటే..పవిత్రమైన వృత్తి అని అందరూ అంటారు.. అనారోగ్యంతో కష్టంలో ఉండి ప్రజలు వస్తే వారికి సాంత్వన చేకూర్చి..వారికి అతి తక్కువఖర్చుతో వైద్యం అందించాలనేది ప్రాధమిక కనీస ధర్మం..కానీ నేటి రోజుల్లో వైద్యం  వ్యాపారమైపోయిన కాలంలో..ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు..

కేవలం డాక్టర్ గారిని కలవాలంటేనే వంద రూపాయల నుంచి మూడు వందలు ఇంకా అత్యవసరమైతే ఐదు వందలు..ఇలా వారిష్టం… ఇక చిన్నపిల్లలకు జ్వరమొస్తే టెస్ట్ లపేరుతో పీల్చిపిప్పి చేస్తున్న నయా డాక్టర్లు..ఇక ఆపరేషన్లు అవసరమైతే..ఆస్తులమ్మి లక్షల రూపాయలు ఆసుపత్రులకు ధారపోసే పరిస్థితులున్న ఈ రోజుల్లో..

నేనున్నాను అంటూ ఆపన్నహస్తం అందించి..కేవలం ఐదు రూపాయలకే డాక్టర్ గారిని కలిసే అవకాశం జిల్లా కాదు రాష్ట్రం మొత్తమ్మీద ఒక్క ప్రజావైద్యశాలలోనే ఉందంటే అతిశయోక్తి కాదు..ఇది నిజంగా తుని నియోజకవర్గం, చుట్టు పక్కల ప్రజల అదృష్టమనే చెప్పాలి..

ఇప్పటివరకు ప్రజావైద్యశాల గురించి తెలుసుకున్న మీరు.. ఆ వైద్యశాలను స్థాపించి..ఒక అత్యుత్తమ ఆశయంతో..వైద్యవృత్తికి న్యాయం చేస్తూ.. పేద ప్రజల ఆరోగ్యమే తన డాక్టర్ సర్టిఫికెట్ కి అర్థం, పరమార్థమని భావించి..వారికి అత్యంత చౌకగా వైద్యం అందించే డాక్టర్ చిలుకోటి పాండురంగారావు అంటే పేరు తెలియని వారు తుని నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు..

ఒక్క ముక్కలో చెప్పాలంటే..

ప్రతిరోజు ఉదయమే ఆరు గంటలకి రెడీ అయిపోతారు. తనకి ముఖ్యమైన పనులేమైనా లేకపోతే..ఇంక ఆయన మదిలో మరో ఆలోచనే ఉండదు. ప్రజాసేవ కోసమని గ్రామాలకు పరుగులెడుతుంటారు. అలా ప్రజలదగ్గరకు వెళ్లి వైద్యం అందించడంలోనే తనకు ఆత్మసంతృప్తి ఉందని చెప్పే డాక్టరు గారు..తనకి ఓపిక ఉన్నంతవరకు ఇలా నేను నమ్మిన సిద్ధాంతంలోనే పని చేస్తుంటానని ఘంటాపథంగా చెబుతుంటారు.

తెలిసిన వారేమంటారంటే..

ఆయన ఎవరి దారిలోనూ వెళ్లరు. తనకంటూ ప్రత్యేకమైన ఒక దారి వేసుకున్నారు.. అందులో కష్టమైనా, నష్టమైనా, బాధలున్నా, సంతోషమున్నా.. అదే దారిలో తను నమ్మిన సిద్ధాంతాలతో  మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతుంటారు.అదే ఆయన ప్రత్యేకత. తునిలో ప్రజావైద్యశాల నిర్మించి 30 ఏళ్లకు పైగా.. ప్రజలందరికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నారు. మందులు కూడా ఖరీదైనవి కాకుండా అవసరమైన మేరకే రాసి..ఎందరో మన్ననలు పొందే డాక్టర్ పాండురంగారావు గారంటే ప్రజలు అనేమాట..

డాక్టర్ గారు మాకు దైవంతో సమానం…

తన దగ్గరకు వచ్చేవారిని అతితక్కువ ఫీజుతో చూడటమే కాదు..ఇంకా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆసుపత్రికి రాలేకపోతున్నారని భావించి.. వారానికి రెండుమూడురోజులు గ్రామాల్లో పర్యటిస్తుంటారు. కొన్నిచోట్ల ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటారు. సాధ్యమైనంతవరకు అక్కడ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసి..ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంటారు.

జల్లాలోని పలుచోట్ల మారుమూల ప్రజలు జ్వరాలతో, ఇతర రోగాలతో అవస్థలు పడుతుంటారు..కానీ ఇక్కడ తుని నియోజకవర్గంలో అలాంటి మూకుమ్మడి అనారోగ్యం కేసులు చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఊరికి అందరికన్నాముందు ఈయనే వెళ్లిపోతారు. ముఖ్యంగా మలేరియా జ్వరాలు, కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులకు ఆ వైద్యశిబిరంలో ఉచితంగా వైద్యం చేస్తుంటారు.

డాక్టర్ గారికి ఒక కోరిక ఉంది…

అదేమిటంటే తను ప్రజాసేవను కేవలం  వైద్యవృత్తి  ద్వారానే చేయగలుగుతున్నాను అని. ప్రజలు చాలామంది రకరకాల సమస్యలతో ఆయన ముందుకు వస్తుంటారు. అప్పుడప్పుడు వారికేమీ చేయలేకపోతున్నానే అనే భావన ఆయనకు కలుగుతుంటుంది.

అందువల్ల తాను రాజకీయాల్లోకి వస్తే.. మరింత అధికంగా ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుంది.. తద్వారా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని భావించి.. ఈసారి 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా  తుని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ప్రజలు కూడా చెప్పడమేమిటంటే..

సార్.. మీరు రాజకీయాల్లోకి రండి..

మాకెంతో మేలు జరుగుతుంది..మీలాంటి వాళ్లు రావాలి.. అని అందరూ అడగడం కూడా తనలో ఒక ఆలోచన కలిగేందుకు  కారణంగా సన్నిహితులు చెబుతుంటారు. ఇలాచూస్తే..ఆయన వ్యక్తిత్వం, స్వభావం, ప్రజాసేవ చేసే తత్వం..ఇవన్నీ చూస్తే… ప్రజా కోరిక మేరకే ఆయన రాజకీయ ప్రవేశం చేశారని కచ్చితంగా చెప్పవచ్చు..

పక్కా కాంగ్రెస్ వాది..

భారతదేశంలో కొందరు స్వాభావికంగా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉండిపోయారు. అంటే దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు మరిచిపోలేనివి.. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ లాంటి ఎందరో కొన్ని లక్షలమంది మహానుభావులు కాంగ్రెస్ పార్టీ గొడుగు నీడలోనే స్వాతంత్రం కోసం పోరాడారు.

ఆ భావజాలం చాలామందిలో ఉండిపోయింది..అంటే చదువుకునే సమయంలో కావచ్చు.. తమ ముందు తరాల్లో స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొని ఉండవచ్చు.. అలా ఇళ్లల్లో చర్చలు, ఆశయాలు, పాదయాత్రలు, నిరాహారదీక్షలు.. ఇలా ముందు తరాల వాళ్లు ఇచ్చిన ఇన్సిపిరేషన్ కావచ్చు.. కాంగ్రెస్ నాయకుల స్వాతంత్రపోరాట వీరగాథలు కావచ్చు..

అంతకుమించి ఒకప్పుడు కాంగ్రెస్ గుర్తు చేనేత వంశీయుల రాట్నం ఉండేది.. స్వదేశీ వస్త్రాలు ధరించాలనే భావనతో గాంధీగారు కూడా ఎప్పుడూ చేనేత రాట్నం తిప్పుతూనే ఉండటం విశేషం..ఈరోజు చేనేతకు జాతీయస్థాయి గుర్తింపు కాంగ్రెస్ పార్టీ వల్లే వచ్చిందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

తను నమ్మిన కాంగ్రెస్ పార్టీలో…

ఇలాంటి ఎన్నో కారణాలతో ఏమైతేనేం డాక్టరుగారు తను నమ్మిన కాంగ్రెస్ పార్టీలో అలాగే ఉండిపోయారు. తుని పట్టణంలో తన ప్రజావైద్యశాల పక్కనే కాంగ్రెస్ కార్యాలయం కూడా కట్టించారు. ఇప్పుడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే తుని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్నారు.

ఒకవైపు రెండు ప్రధానపార్టీలు, మరో కొత్త పార్టీ బరిలో నువ్వా నేనా? అంటూ తలపడుతుంటే ఆయనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా.. వెళ్లకుండా.. తనకి ప్రజలపై ఉన్న అచంచలమైన విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి  దిగారు.

30 ఏళ్ల క్రితం.. ఎలా ఉందో..ఇప్పుడు అలాగే ఉంది..

మీకు నేను సేవ చేస్తున్నాను కాబట్టి అందుకు ప్రతిఫలంగా ఓటు వేయమని ఆయన అడగరు. మీకు మంచి నాయకుడు కావాలా? వద్దా? మీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే వారు కావాలా? వద్దా? ఎన్నాళ్లిలా ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోతారు..అని మాత్రమే ప్రశ్నిస్తుంటారు.

పేరుకే ఆర్థికమంత్రి నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు విజయం సాధించారు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే.. పాతికేళ్ల క్రితం తుని పట్టణం ఎలా ఉందో..ఇప్పటికి అలాగే ఉండటం.

దేశమంతా అభివృద్ధి చెందింది..రాష్ట్రమంతా అభివృద్ధి చెందింది..అదిగో అమరావతి  అంటున్నారు..మరి ఇదిగో తుని నియోజకవర్గం అని చెప్పగలుగుతున్నారా.. తెలుగుదేశం పార్టీలో మన యనమల రామకృష్ణుడి స్థానం నెంబరు 2 అంటున్నారు..కానీ ఆయన నియోజకవర్గానికి చేసిన ఒక గొప్ప పని, పథకం, అభివృద్ధి ఏదీ లేదు.

అదే మెయిన్ రోడ్డు, ఎప్పటిదో ఆ బస్టాండు, అదే పాత మార్కెట్, అవే రోడ్లు, అదే రద్దీ.. అక్కడో రైల్వేగేటు..తుని పట్టణంలో పుట్టి పెరిగిన వారిని అడిగితే చెబుతారు..వీళ్ల హయాంలో ఎంత అభివృద్ధి చెందిందో..అందుకే ఎన్నో ఏళ్లుగా తను నమ్మిన సిద్ధాంతం కోసం సొంత డబ్బులు ఖర్చు చేస్తూ.. ప్రజలకు సేవ చేస్తున్న డాక్టరు పాండురంగారావు ఈసారి తప్పకుండా విజయం సాధిస్తారని స్థానికులు పేర్కొనడం విశేషం.

– శ్రీనివాస్ మిర్తిపాటి