ముగిసిన నామినేషన్ల ఘట్టం…ఏపీలో 175 స్థానాలకు 3,279 నామినేషన్లు..

8:58 am, Tue, 26 March 19
AP latest updates

ఏపీ: తొలి దశ సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగిసింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలతోపాటు ఏపీ శాసనసభకు తొలి దశలోనే ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల పరిశీలన పక్రియ ప్రారంబించింది.

దీనితో నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3,279 మంది నామినేషన్లు వేశారు. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 370 మంది నామినేషన్లు వేశారు.

25 లోక్ సభ స్థానాలకు 472 నామినేషన్లు

విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 111 నామినేషన్లు వేశారు. ఈ లెక్క ప్రకారం సగటున ఒక్కో నియోజకవర్గానికి 19 మంది పోటీ పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా 146 మంది, విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా 245, తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలుండగా 219, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా 244 మంది నామినేషన్లు వేశారు.

16 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కృష్ణా జిల్లాలో 353, 17 నియోజకవర్గాలున్న గుంటూరు జిల్లాలో 370, 12 నియోజకవర్గాలున్న ప్రకాశం జిల్లాలో 236 నామినేషన్లు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 129, చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 287, అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 288, కడప జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 217, కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 334 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

ఇక లోక్‌ సభ విషయానికి వస్తే, 25 స్థానాలకు గాను 472 మంది నామినేషన్‌ వేశారు. అత్యధికంగా నంద్యాల పార్లమెంటుకు 36, తర్వాతి స్థానంలో గుంటూరు 25, విశాఖపట్నం 24, కడప 24, కర్నూలు 23, అనంతపురం 23, మచిలీపట్నం 22, నర్సాపురం 20, విజయవాడ 19, నరసరావుపేట 19 నామినేషన్లు వచ్చినట్టు తెలిపారు. ఉపసంహరణకు గడువు మార్చి 28.