అడుగడుగునా అవమానాలే: చెవిరెడ్డిని అడ్డుకున్న వెంకటరామాపురం గ్రామస్తులు…

4:50 pm, Fri, 17 May 19

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్‌ బూత్‌ల్లో రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెల్సిందే. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి,  కొత్త కండ్రిగ,  కమ్మపల్లి, వెంకటరామాపురం  పోలింగ్‌ స్టేషన్లలో పార్లమెంటు, శాసనసభలకు మే19న రీ–పోలింగ్‌ నిర్వహించనున్నారు.

అయితే ఎన్నికలు ముగిసి సుమారు 38 రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా వైసీపీ ఫిర్యాదు చేసిన పోలింగ్ బూతుల్లోనే రీపోలింగ్ పెట్టారని, తాము ఫిర్యాదు చేసిన పోలింగ్ బూతుల్లో పెట్టలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఇక పోలింగ్ జరిగే ఈ ఐదు ప్రాంతాలు టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు కావడంతో అక్కడ వైసీపీ నేతల ప్రవేశానికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డే  రీపోలింగ్ నిర్వహించడానికి కారణం కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

చదవండి:  చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత! వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డిని అడ్డుకున్న కమ్మపల్లి గ్రామస్తులు…

ఈ క్రమంలోనే  చెవిరెడ్డి ఈరోజు పోలింగ్ జరిగే వెంకటరామాపురం గ్రామానికి వెళ్లి ప్రచారం చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ప్రచారం  చేసేందుకు వచ్చిన చెవిరెడ్డిని గ్రామస్తులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు.

గ్రామస్తులకి చెవిరెడ్డి వార్నింగ్..

అసలు ఊళ్లోకి అడుగుపెట్టేందుకు వీల్లేదని గ్రామస్తులు తెగేసి చెప్పేస్తున్నారు. ఓ దశలో మహిళలు కూడా చెవిరెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ప్రచారం ఆపేసి చెవిరెడ్డి మధ్యలోనే వెనుదిరిగారు. ఇలా అడుగడుగునా అవమానాలు ఎదురవడంతో చెవిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. తిరుపతికి వస్తారుగా, అక్కడ చూసుకుంటా మీ సంగతి అంటూ గ్రామస్తులకి వార్నింగ్ ఇచ్చారు.

కాగా, గతరాత్రి, ఈ ఉదయం ఎన్ఆర్ కమ్మపల్లెలోనూ చెవిరెడ్డికి ఇదే తరహా చేదు అనుభవాలు ఎదురవ్వడం గమనార్హం.

చదవండి:  మే 23 తర్వాత టీడీపీ ముక్కలవుతుంది: వైసీపీ ఎంపీ విజయసాయి