ఒక్క నిమిషం.. ఇది అపరిచితుని సందేశం..

11:50 am, Fri, 29 March 19
Vote News, AP Latest Vote News , AP Latest News, Newsxpressonline

అపరిచితుడు మాట్లాడుతున్నాడు..

మన దేశంలో, రాష్ట్రంలో  ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత భారీగా ఎన్నికల్లో ఖర్చు చేసే దేశంలో భారతదేశం మొదటి  స్థానంలో ఉందని మీరెప్పుడైనా విన్నారా.. అసలు ఎన్నికలకు ఎంత ఖర్చు చేస్తారో.. తెలుసుకున్నారా? ఎంతో గొప్పగా జరిగే అమెరికా దేశంలో ఎన్నికల్లో ఖర్చుపెట్టే దానికన్నా మనమే ఎక్కువ ఖర్చు చేస్తున్నామనే సంగతి తెలుసా?.. ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ కి అయ్యే ఖర్చు…

సుమారు రూ.5000 కోట్ల రూపాయలని అంచనా..గత 2014లో అయిన ఖర్చు 3,400 కోట్ల రూపాయలు.. ఆశ్చర్యపోకండి..అసలు విషయం చెబుతాను..మన భారతదేశంలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు తెలిస్తే..అందరి గుండె పగిలిపోతుంది..

అక్షరాలా 50వేల కోట్ల రూపాయలు..

దేశంలో ఉన్న 545 లోక్ సభ స్థానాలు, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం గెలిచేందుకు అభ్యర్థులు చేసే ఖర్చు ఇది..అందుకే అత్యంత ఖరీదైన ఎన్నికలు నిర్వహించే దేశంగా ప్రథమస్థానంలో  గుర్తింపు పొందింది.ఇంతింత ఖర్చుపెట్టింతర్వాత గెలిచిన గొప్పగొప్ప అభ్యర్థుల వల్ల మన దేశానికి వచ్చే ర్యాంకులు ఒకసారి చూద్దామా?

ప్రపంచంలో అవినీతి అత్యధికంగా ఉన్న 175 దేశాల్లో..మన స్థానం.. 78

1995 నుంచి 2018 వరకు చూస్తే భారతదేశంలో అవినీతి 75శాతం పెరిగిందని అంతర్జాతీయ సర్వేలు సూచిస్తున్నాయి. 2011 ఒక్క ఏడాదిలో అత్యధికంగా 95శాతం పెరిగితే, 1995లో 35శాతం అత్యల్ప అవనితీ స్కోర్ అని నిగ్గు తేల్చారు. అమెరికాలో 22 శాతం ఉంటే.. జర్మనీలో అతి తక్కువ 11శాతమే అవినీతి నమోదైంది.

నిత్యం మద్యం తాగే దేశాలకన్నా ఎంతో వెనకాల ఉండే మన ఇండియా..                                                       నేడు 191 దేశాలతో పోలిస్తే..మన స్థానం 119కి ఎగబాకింది.                                                                    అంటే మనవాళ్లు ఎంత తాగుతున్నారో..తాగుడులో ఎంత ఎత్తుకు ఎదిగిపోయారో.. ఎంత తగలేసేస్తున్నారో చూడండి.. మన ప్రజాప్రతినిధులు, మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా పనిచేస్తుందో మీరందరూ ఇక్కడ గమనించండి..

ప్రపంచదేశాల్లో తినడానికి తిండి దొరకని పేదవాళ్లుండే 119 దేశాల్లో..మన సంఖ్య 103..

అంటే ఏమాత్రం పేదవాడికి కడుపు నిండా తిండి కూడా పెట్టలేని ప్రజాస్వామ్య దేశంగా ఇంకాఇంకా వెనక్కిపోతోంది. కనీసం వాళ్లకి పని కూడా కల్పించలేకపోతున్నామంటే ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నామో చూడండి.. ఎంతమంది అన్నార్తులు ఆకలితో అల్లాడుతున్నారో చూడండి..ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చుపెట్టి గెలిచే మన ప్రజాప్రతినిధుల నిర్వాకం చూడండి..

ఆత్మహత్యలు జరిగే 106 దేశాల్లో మనస్థానం 41..                                                                                    ఆరోగ్యం కోసం కోట్లాదిరూపాయలు ఖర్చుపెట్టే 190 దేశాల్లో.. మన స్థానం 140

అంటే ఆరోగ్యంలో కూడా ఎంత వెనుకబడి ఉన్నామో చూడండి..ఇవేవీ కాకిలెక్కలు కాదు..అంతర్జాతీయ సర్వేలు చెబుతున్న నిజాలు…అందుకే మీకు ఒక మాట చెప్పడానికి వచ్చాను..మీరందరూ రేపు ఉత్సాహంగా ఓటేయడానికి బయలుదేరుతారు. మంచిదే..మరి ఐదేళ్లు పాలించే వ్యక్తి కోసం..

ఒక్క క్షణమైనా ఆలోచించారా…

మీ ఊరు, మీ రోడ్డు, మీ స్కూల్, మీ ఆసుపత్రి, మీ మంచినీరు, మీ వీధిలైట్లు , మీకు అందే అన్ని ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు..ఇలా ప్రతీ మౌలిక సదుపాయాలు..ప్రభుత్వం కల్పించేవన్నీ అందుతున్నాయా? లేవా?అని గుర్తించండి. వీటన్నింటినీ దగ్గరుండి చూసి.. ప్రజలకు అందేలా చేయడానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి.. అది కూడా ప్రజలకు నచ్చిన వ్యక్తినే చూడాలని భావించి  మన ప్రజాస్వామ్యం కల్పించిన గొప్పహక్కు మన ఓటు..ఇలా ప్రజలందరూ ఎన్నికల్లో ఓటు వేస్తే.. గెలిచి తద్వారా ప్రజల కోసం నియమితులైన…

ఒక కాపలాదారు..ఈ ఎమ్మెల్యేగారు…

అందుకే  మీరు ఓటేసే ముందు ఒక్కక్షణం ఆలోచిస్తున్నారా..పైన చెప్పిన అన్ని సమస్యలు అతను తీరుస్తాడని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా…అందుకే ఇవన్నీ చెబుదామని మీకోసం వచ్చాను.. నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీకు చెబుతాను..చూడండి.. నేను ఒక ఓటరుగా వేషం వేసుకొని…ఒక పార్టీ తరఫున నిలిచిన అభ్యర్థి వద్ధకు వెళ్లాను..             మా ఇద్దరి మధ్య సంభాషణ

అపరిచితుడు: నా గురించే ఆలోచిస్తున్నావు కదూ..

అభ్యర్థి: నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తాను…ఎన్నికలప్పుడు మరీ ఎక్కువ..

అపరి: నాకు నిజంగా సేవ చేస్తావా?

అభ్యర్థి: ఓటేసి చూడు..

అపరి: నిజం చెప్పు… నేనెప్పుడూ గుర్తుంటానా..

అభ్యర్థి: నా జీవితం.. నీకే కదా..అంకితం

అపరి: పోయినసారి గెలిచాక..బాగా సంపాదించావంట..

అభ్యర్థి: అది.. మీ కోసమే..  ప్రతి ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేయాలి.తిరిగి మీకివ్వాలి కదా..

అపరి: సరే.. మొదటిసారి నేను నీకు ఓటేసినప్పుడు ఏమనిపించింది..

అభ్యర్థి: నీ అంత చైతన్యవంతమైన ఓటరు లేడనిపించింది.

మరిలాంటి నాయకులను ఏం చేయాలి? అందుకే నేను మీ ముందుకు వచ్చాను.. కొన్ని విషయాలు చెబుతాను..ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి..

మొదట డబ్బులు తీసుకొని ఓటేస్తే ఎదురయ్యే నష్టాలు వివరిస్తాను..

 1. అభ్యర్థి మిమ్మల్ని చిన్న చూపు చూడటం ప్రారంభిస్తాడు. నువ్వు కూడా నాలాగే అవినీతి పరుడివేరా..అని అంటాడు లేదా అనుకుంటాడు.
 2. అలా నైతికంగా అభ్యర్థిని నిలదీసే హక్కును కోల్పోతాం
 3. ప్రజలకు మేలు చేసే మంచి అభ్యర్థిని ఎంచుకోలేం
 4. వారిచ్చే 2వేల రూపాయలు.. నాలుగురోజుల్లో ఖర్చయిపోతుంది..కానీ మీరిచ్చే అధికారం ఐదేళ్లు ఉంటుంది..
 5. మీకళ్ల ముందే అక్రమాలకు పాల్పడే ధైర్యం అతనికి వస్తుంది
 6. ఒకవేళ మీరు ప్రశ్నించినా… ఏం ఉత్త పుణ్యానికే ఓటు వేశావా..అని నిలదీస్తాడు..
 7. ఒక నియోజకవర్గంలో 50కోట్ల రూపాయల వరకు ఖర్చుపెట్టేందుకు సిద్ధమైన వ్యక్తి..తిరిగి డబ్బులు సంపాదించుకోవడానికే ప్రయత్నిస్తాడని గుర్తుంచుకోండి. మీ కాలనీలో, మీ ఊరిలో , మీ పట్టణంలో సమస్యలని పట్టించుకోడు..ఎంతసేపు తను ఖర్చుపెట్టిన 50కోట్లు ఎలా సంపాదించాలనే ధ్యాసలోనే ఉంటాడు. ఆమార్గాలనే వెతుకుతుంటాడు. ఆ తర్వాత వడ్డీ చూసుకుంటాడు.. తర్వాత లాభం చూసుకుంటాడు..ఆ తర్వాత మళ్లీ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ ఖర్చు చేయాలి..అంటే ఇప్పుడు 50 కోట్లు కదా.. 2024లో 75 కోట్లు కావాలి కదా.. అందుకు మళ్లీ మొదలుపెడతాడు..ఇలా ఐదేళ్లు అవినీతి మార్గంలోనే క్షణం తీరికలేకుండా గడుపుతాడు..ఇక ప్రజాసేవకు చోటెక్కడుంది..
 8. ఇప్పుడు వంగి వంగి దండాలు పెట్టిన అదే అభ్యర్థి..ఈ ఐదేళ్లు అలాగే ప్రవర్తిస్తాడని భ్రమపడకండి. కారు దిగను కూడా దిగడు. ఒకసారి మీ మాజీ ఎమ్మెల్యేలను గుర్తుకు తెచ్చుకోండి.
 9. బొట్టు, కాటుక మరీ పెట్టి పెళ్లికి పిలిచినట్టు పిలుస్తారు. గెలిచిన తర్వాత కలవడానికి వెళ్లినా దగ్గరకు కూడా రానివ్వరు..
 10. ఓటు వేసే ముందు మీ చేతులు పట్టుకుంటారు. మీ ఆడవాళ్లు బట్టలు ఉతుకుతుంటే గబగబా వెళ్లి ఉతికేస్తారు. గెలిచన తర్వాత వచ్చి ఉతకమనండి..చూద్దాం.. అందుకే ఆత్మవిమర్శ చేసుకోండి
 11. నిజమైన అభ్యర్థిని గుర్తించండి..
 12. మీరెందుకిలా ఆలోచించరు..
 13. మీ ఒక్కగానొక్క అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్లి చేసే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.వారి గుణగణాలు పరిగణలోకి తీసుకుంటారు. రహస్యంగా ఛుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేస్తారు. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా.. మంచి స్థలం కోసం వెదుకుతారు. వాస్తు అంటారు.. గాడిద గుడ్డు అంటారు. గుమ్మానికి గుమ్మడికాయ వేలాడదీస్తారు. మీ ఇంట్లో పిల్లల స్కూలు దగ్గర నుంచి, మీ ఇంట్లో సరుకులు ఎక్కడ తేవాలో అన్నీ..అన్నీ గంటలకొద్దీ ఒకటికి పదిసార్లు ఆలోచించే మీరు.. మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, మనదేశాన్ని పరిపాలిస్తూ బాగు చేసే వారికోసం ఒక్క క్షణం ఎందుకాలోచించరు…

మనకు సంబంధం లేదు..అంతే కదా.. పక్కనోడు ఎలా పోతే మనకెందుకు?

సమాజం లాంటి పెద్ద పెద్ద మాటలు మనకెందుకు?

వీధులు,రోడ్లు ఎలా ఉంటే మనకెందుకు..

మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు కదా..

మనం వెళ్లేసరికి పనైపోతుంది..అవతలివాడి గొడవ మనకెందుకు?

ఇలా ప్రతి విషయంలో మనకెందుకు? మనకెందుకు? అని అనుకోవడం వల్లే.. భారతదేశంలో ఎన్నికల కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెడుతున్నారు. ఎందుకంటే అంతకన్నా విచ్చలవిడిగా సంపాదించుకోవచ్చుననే ఉద్దేశంతో… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు నిర్వహించే దేశంలో భారతదేశం అగ్రస్థానంలో ఉందంటే రాజకీయాలు ఎంత ఖరీదైపోయాయో..ప్రజాసేవ పేరుతో ఎంత దోపిడి జరుగుతుందో అర్థం చేసుకోండి.. 50వేల కోట్లరూపాయలంటే  మనదేశంలో ఒక చిన్న రాష్ట్రం వార్షిక బడ్జెట్ తో సమానం..మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు..అదీ మన ముఖ్యమంత్రి చంద్రబాబుగారి విజన్ వల్ల..అమరావతి నిర్మాణాల వల్ల అది పెరిగిందిగానీ లేకపోతే లక్ష కోట్ల వరకే ఉండేది..అలాంటిది ఒక్క ఎన్నికలకు ఎంత ఖర్చుపెడుతున్నారంటే.. అంతకు పదింతలు సంపాదించుకోవచ్చుననే ఉద్దేశంతోనే ఇంత బరితెగిస్తున్నారు. అందుకే మీరందరూ ఒక మాటపై నిలిస్తే అభ్యర్థులను దారికి తేవడం చాలా సులువు..

అందుకే ఓటువేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. జైహింద్

-శ్రీనివాస్ మిర్తిపాటి