టీడీపీ అభ్యర్థికి షాక్: నామినేషన్ తిరస్కరణ

janardhan
- Advertisement -

అమరావతి: ఏపీలో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లను పరిశీలించి ఆమోదం తెలిపారు. అయితే, విజయనగరం జిల్లాలో మాత్రం ఓ టీడీపీ అభ్యర్థికి షాక్ తగిలింది. కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్దన్‌ థాట్రాజ్‌ నామినేషన్‌‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి అభ్యంతరాలు రావడంతో.. నామినేషన్‌ను పక్కన పెట్టారు.

జనార్దన్ నామినేషన్‌లో తప్పులు ఉన్నాయని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. 2013నాటి ఎస్టీ ధ్రువీకరణ పత్రం ఎలా తీసుకున్నారంటూ ఎన్నికల అధికారిని ప్రశ్నించారు. అలాగే జనార్దన్ ఎస్టీ కాదంటూ హైకోర్టు, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన కాపీలను అందజేశారు. దీంతో ఎన్నికల అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు.

బరిలో జనార్ధన్ భార్య..

టీడీపీ ముందస్తు జాగ్రత్తగా జనార్దన్ థాట్రాజ్ తల్లి నరసింహ ప్రియా థాట్రాజ్‌‌తో నామినేషన్ వేయించారు. ఈ నామినేషన్‌కు అధికారులు ఆమోదం తెలిపారు. దీంతో ఆమెను టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నారు.

ఇది ఇలా ఉండగా, నామినేషన్‌ పేపర్లలో తప్పిదం కారణంగా తీవ్ర ఉత్కంఠ అనంతరం ఏపీ మంత్రి నారా లోకేష్‌ నామినేషన్‌ను అధికారులు ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో మంగళగిరి టీడీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.

చదవండి: ముసుగులో గుద్దులాటలొద్దు: ఎస్పీవై రెడ్డికి చంద్రబాబు బంపర్ ఆఫర్
- Advertisement -