పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత: అభిమాని అత్యుత్సాహం.. కిందపడిపోయిన జనసేనాని!

7:33 pm, Fri, 5 April 19
pawan kalyan

అమరావతి/విజయనగరం: ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్‌ మధ్యాహ్నం తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో అక్కడ ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది.

విజయనగరం పర్యటన ముగించుకొని గుంటూరు జిల్లాలో ప్రచార సభలకు వెళ్లేందుకు హెలికాప్టర్‌లో విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొంత విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు సూచించారు. మరోవైపు గుంటూరు జిల్లా తెనాలి, సత్తెనపల్లిలో రోడ్‌షో, బహిరంగ సభలకు జనసేన స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. 

ఈ నేపథ్యంలో శ్రేణులను నిరుత్సాహానికి గురిచేయకుండా సభావేదిక వద్దకు బయల్దేరేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవగా.. వైద్యులు వద్దని వారించారు. దీంతో ఆ రెండు సభలను రద్దు చేసినట్టు పార్టీ నేతలు తెలిపారు.

శనివారం నుంచి పవన్ ప్రచారానికి సిద్ధమవుతారని జనసేన వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల ప్రచార గడువు ఏప్రిల్ 9తో ముగియనుంది. దీనికి సరిగ్గా నాలుగు రోజుల ముందు పార్టీ అధినేత అస్వస్థతకు గురికావడం జనసేన పార్టీ శ్రేణుల్ని కొంత కలవరపాటుకు గురిచేస్తోంది.

అభిమాని అత్యుత్సాహంతో కిందపడిపోయిన పవన్

పవన్ కళ్యాణ్‌ను చూస్తే ఆయన అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. పూనకంతో ఊగిపోతారు. ఒక్కోసారి వారి అభిమానం జనసేనానికి ఇబ్బందికరంగా కూడా మారుతుండడం గమనార్హం.

తాజాగా విజయనగరంలో జనసేన బహిరంగ సభలో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. వేదికపై పవన్‌ మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని పవన్‌ కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు.

దీంతో ఒక్కసారిగా తుళ్లిపడి వేదికపై కింద పడిపోయారు పవన్. మైక్‌ కూడా విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆయన్ని పైకి లేపారు. అనంతరం ఆ అభిమానిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. విజయనగరంలో అయోధ్య మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ వేదికపై ఈ ఘటన చోటు చేసుకుంది.

చదవండి: ప్రశ్నిస్తానంటూ వచ్చి ఆయనే ప్రశ్నగా మారాడు!: పవన్ కళ్యాణ్‌పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు