షర్మిల ప్రచారం: జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు.. చంద్రబాబుపై ఫైర్!

1:19 pm, Tue, 2 April 19
sharmila

పామర్రు: నియోజకవర్గ పరిధిలోని వీరంకిలాకులో మంగళవారం ఉదయం వైసీపీ నాయకురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ‘జగన్ సీఎం… సీఎం’ అని నినాదాలతో హోరెత్తిస్తుంటే, షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీనికి షర్మిల స్పందిస్తూ.. అవుతాడమ్మా అవుతాడు.. యడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు.. అని వ్యాఖ్యానించారు. రాజశేఖరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నది ఐదు సంవత్సరాలు మాత్రమేనని, ఆ ఐదేళ్లలోనే రాష్ట్రం ఎప్పుడూ చూడని అభివృద్ధి చూసిందని, ఎప్పుడూ చూడని సంక్షేమాన్ని చూసిందని ఆమె అన్నారు.

‘‘ఇప్పుడూ ఉన్నాడో ముఖ్యమంత్రి…’’

మన, పర తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, అది ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమేనని గర్వంగా చెప్పుకోగలమని షర్మిల చెప్పారు. అంతేకాదు.. ‘‘కానీ, ఇప్పుడూ ఉన్నాడో ముఖ్యమంత్రి. చంద్రబాబు గారు… ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో ఐదేళ్లల్లోనే చూపించేశాడు..’’ అంటూ సీఎం చంద్రబాబును ఆమె ఎద్దేవా చేశారు.

రైతులకు మొత్తం రుణం మాఫీ చేస్తానంటే అధికారంలోకి వచ్చారని, అదే మొదటి సంతకమన్నారని, కానీ దిక్కుందా? ఒక్క రైతుకు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదు అని షర్మిల వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళలను ఇదే తరహాలో సీఎం చంద్రబాబు మోసం చేశారని, ‘పసుపు – కుంకుమ’ పథకం మరో మోసపు కుట్రని ఆమె విమర్శలు గుప్పించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తానని చెబుతూ విద్యార్థులను కూడా మోసం చేశాడని, ఆరోగ్యశ్రీని నీరుగార్చారని చెబుతూ ఇటువంటి సీఎం మీకు అవసరమా? అని షర్మిల ప్రశ్నించారు. మంచి సీఎంను ఎన్నుకోవాల్సిన సమయం వచ్చిందని,  ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు.

చదవండి: జగన్‌తో అంటకాగుతారా? అసహ్యంగా లేదూ..: ప్రధాని మోడీపై చంద్రబాబు