జగన్ సభలో అపశ్రుతి, గోడ కూలి ఒకరి మ‌ృతి, పలువురికి గాయాలు…

12:23 am, Thu, 28 March 19
tragedy-in-jagans-meeting-at-mandapeta

తూర్పుగోదావరి: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. హఠాత్తుగా గోడ కూలిపోగా, ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇంకా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

చదవండి: పోలింగ్ జరగకముందే వైసీపీ తరపున గెలిచిన మొదటి ఎమ్మెల్యే..

మండపేటలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పోటెత్తిన జనంతో రోడ్డు కిక్కిరిసిపోవడమేకాక, రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలు, వాటి పిట్టగోడలపై కూడా జనం భారీగా నిలబడ్డారు.

పిట్టగోడ కూలడంతో…

జగన్‌ను చూసేందుకు పలువురు చుట్టుపక్కల ఉన్న భవనాలపైకి ఎక్కేశారు. జగన్ ప్రసంగిస్తున్న సమయంలో మధ్యమధ్యలో చప్పట్లు కొడుతూ.. ఓ భవనం పిట్ట గోడ వరకు వచ్చారు. అంతే వారి బరువుకు.. ఆ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. కొంతమంది పైనుంచి కిందకు పడిపోయారు. ఇటుకరాళ్లు మీద పడి మరికొందరు గాయపడ్డారు.

ఈ ఘటనలో దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షతగాత్రుల్ని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పిల్లి రాములమ్మ అనే మహిళా కార్యకర్త మృతి చెందడంతో వైసీపీ శ్రేణుల్లో విషాదం అలుముకొంది.

ఇంకా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులలో మీడియా సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. గోడ కూలిన ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. పరిస్థితిని పర్యవేక్షించాలని పార్టీ నేతల్ని ఆదేశించారు. 

చదవండి: మానవా.. ఇక నువ్వు మారవా?: మళ్ళీ నోరుజారి దొరికిపోయిన నారా లోకేశ్!