తన చివరి ప్రసంగంలో.. వైఎస్ జగన్ ఏం చెప్పాడో తెలుసా?

6:30 pm, Tue, 9 April 19
జగన్ తన చివరి ప్రసంగంలో జగన్ ఏంచెప్పాడో తెలుసా!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పర్వంలో కీలక ప్రచార ఘట్టం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రాష్ట్రంలో వేసవి ఎండలను మించి వాడీవేడిగా సాగిన ప్రచార హోరుకు తెరపడింది. ఏపీలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది.

ఇప్పటివరకు హోరెత్తిన మైకులు మూగబోయాయి. ప్రచార కోలాహలం సద్దుమణిగడంతో ఇక పార్టీలన్నీ 11వ తేదీన జరగనున్న పోలింగ్‌ ప్రక్రియపై దృష్టి సారించాయి. అందుకు తగిన ఏర్పాట్లలో తలమునకలు అయ్యాయనే చెప్పాలి.

జగన్‌కి అదే ప్లస్ పాయింట్ అవుతుందా?

ఈ ఎన్నికల ప్రచారపర్వంలో వైసీపీ , టీడీపీ, జనసేన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకుంటూ ముందుకుసాగారు. కాకపోతే ఐదేళ్ల నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉన్నారు. అదే ఆయనకి ఇప్పుడు ప్లస్ పాయింట్‌గా మారనుంది.

ప్రజల కష్టాలని తెలుసుకోవాలనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్‌కి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు.  ఇది అటు టీడీపీకి, ఇటు జనసేనకు కొంత ప్రతికూలం అనే చెప్పాలి. పైగా మొదటి దశలోనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారానికి తగినంత సమయం కూడా లేదు. దీంతో ఆఘమేఘాల మీద ప్రచారాన్ని ప్రారంభించి, పూర్తిచేశారు.

అయితే గత ఏడాదిగా ప్రజల మధ్యనే ఉన్న జగన్ మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి, ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకునే ప్రతి చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా వినియోగించుకున్నారు. జగన్ మొత్తంగా 13 జిల్లాల్లో కలిపి 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు.

ప్రచార పర్వం ముగింపులో సంచలన వ్యాఖ్యలు…

అసలు విషయానికొస్తే… ఎన్నికల ప్రచారం కొద్దిసేపట్లో ముగుస్తుందనగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ.. ఒకసారి ఆలోచన చేయండి, ఈ రాజకీయాలు మారాలి, అబద్ధాలు పోవాలి, విశ్వసనీయత అన్న పదం రాజకీయాలలోకి రావాలి.. అని చెప్పారు.

ఈ వ్యవస్థలో మార్పు జరగాలి అంటే జగన్ ఒక్కడి వల్ల సాధ్యం కాదని, మరో రెండ్రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ మార్పు చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రజలేనని, ప్రజలు సహకారం అందిస్తే, తాను చెప్పిన ప్రతి విషయాన్ని అమలులో చూపిస్తానని చెప్పారు.

అలాగే ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని ప్రజలందరిని తాను కోరుతున్నానని, తొమ్మిదేళ్లుగా ప్రజలు తనను చూస్తున్నారని, ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా అక్కడికి వెళ్లానని, వారి కోసం పోరాడానని జగన్ అన్నారు. తొమ్మిదేళ్లుగా నన్ను చూస్తున్నారు కనుక, ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాఅని బాల్‌ను ప్రజాకోర్టులో ఉంచారాయన.

ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించమని చెబుతున్నానని చెప్పుకొచ్చారు. నాయకుడికి ప్రజలు తప్ప మరో ధ్యాస ఉండకూడదని, అలాంటి గుణాలు ఉన్న వారు మన కర్మ కొద్దీ ఇప్పటి పాలకుల్లో లేరని విమర్శించారు. ఇలాంటి గుణాలున్న నాయకుడు మళ్లీ రావాలంటే మార్పు తీసుకొచ్చేందుకు ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.

చివరగా ఏం చెప్పారంటే…

అలాగే, వైసీపీపై ప్రజల చల్లని దీవెనలు ఉంచాలని, ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌లో పెద్దఎత్తున పాల్గొని, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైసీపీ అభ్యర్ధులని స్పష్టమైన మెజారిటీతో గెలిపించాలి అని జగన్ కోరారు.

అలాగే చివరగా మరోమాట చెప్తూ.. తాను చెప్పిన ఏ హామీ నెరవేర్చకపోయినా, తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికల బరి నుండి తాను స్వచ్చందంగా తప్పుకుంటానంటూ ఆయన చెప్పడం అందరినీ ఆలోచించేలా చేస్తోంది.