పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై మాటల తూటాలు పేల్చిన వైఎస్ షర్మిల!

2:19 pm, Sun, 7 April 19
ys-sharmila-slams-pawan-kalyan-and-chandrababu

నర్సాపురం: వైఎస్సార్సీపీ నాయకురాలు, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల నర్సాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, చంద్రబాబులపై మాటల తూటాలు పేల్చారు. పవన్ తన అన్న చిరంజీవి చేసిన పనే చేస్తారని, ఆయన జనసేనను టీడీపీకి అమ్మేస్తారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

చదవండి: జనసేనానికి భారీ షాక్ ఇచ్చిన మెగా హీరో! వైసీపీ అభ్యర్థికి మద్దతుగా…

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తరువాత హోల్‌సేల్‌గా దానిని కాంగ్రెస్‌ పార్టీకి అమ్మేశారని, ఇప్పుడు ఆయన తమ్మడు పవన్‌ కల్యాణ్‌ కూడా ఆయన స్థాపించిన జనసేన పార్టీని హోల్‌సేల్‌గా టీడీపీకి అమ్మేస్తారని అన్నారు.

‘‘మాకు ఏ పార్టీతోనూ పొత్తులేదు..’’

కేసీఆర్‌తో పొత్తు కుదుర్చుకోవడానికి చంద్రబాబు వెంపర్లాడారని, పొత్తుకు టీఆర్ఎస్ నో చెప్పడంతో గత్యంతరం లేక కాంగ్రెస్‌తో కలిశారని షర్మిల ఎద్దేవా చేశారు. తమ పార్టీకి ఏ పార్టీతోనూ పొత్తులేదని, తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగామని ఆమె వివరించారు.

కావాలనే చంద్రబాబు తమపై బురదజల్లుతున్నారని, తాము బీజేపీతో కలిసిపోయామంటూ ప్రజలకు చెబుతున్నారని షర్మిల మండిపడ్డారు. అసలు అవినీతి, అరాచకానికి, వెన్నుపోటుకు, దౌర్జన్యానికి మారుపేరు చంద్రబాబే అని షర్మిల వ్యాఖ్యానించారు.

‘‘మాట తప్పిన చంద్రబాబు…’’

ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా చంద్రబాబు మాట తప్పారని, రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేసింది నిజం కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఆయన హామీ ఇచ్చిన మొదటి సంతకానికే దిక్కులేదంటూ ఎద్దేవా చేశారు.

చదవండి: నాన్న కష్టాన్ని చూడలేకపోతున్నా: అకీరా నందన్

ఇప్పుడు మళ్లీ ఎన్నికలొచ్చాయనే చంద్రబాబు ‘పసుపు-కుంకుమ’ పేరుతో డ్వాక్రా మహిళలకు ఎంగిలి చేయి విదిలిస్తున్నారని అన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మోసపోరాదని కోరారు. చంద్రబాబు చేసిన రుణమాఫీ కనీసం వడ్డీకి కూడా సరిపోలేదని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందిపెడుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు.

ఆరోగ్యశ్రీ పథకం నుంచి కార్పొరేటు ఆసుపత్రులను చంద్రబాబు తొలగించారని.. ఆయన కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే గవర్నమెంటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటారా? అంటూ ప్రశ్నించారు. 2019 రాజకీయ సినిమాలో యాక్టర్‌ పవన్‌ కళ్యాణ్‌ అయితే డైరెక్టర్‌ చంద్రబాబేనని, ఆయన మాటలను నమ్మి ఓట్లు వేస్తే మళ్లీ మోసపోవడం ఖాయమని అన్నారు.

చదవండి: చంద్రబాబు ఆడియో టేపు లీక్! ఏముందో చూడండి?