షాకింగ్: హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కరోనా.. భయాందోళనలో వినియోగదారులు

8:09 pm, Sun, 19 April 20
swiggy-food-delivery-agent

హైదరాబాద్: ఢిల్లీలో పిజ్జా డెలివరీ ఏజెంట్‌కి కరోనా మహమ్మారి సోకిందనే విషయం మరువక మునుపే హైదరాబాద్‌లోనూ ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ కరోనా వైరస్ బారినపడ్డాడు.

నాంపల్లి ప్రాంతానికి చెందిన ఈ ఏజెంట్ ఆన్‌లైన్ ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీలో ఏడాదిగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ విషయం తెలియగానే అధికారులు స్పందించారు. ఆ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను గుర్తించి, అతడి కుటుంబాన్ని క్వారంటైన్‌కి తరలించారు.

అంతేకాదు, గత రెండు వారాలుగా అతడు ఏయే రెస్టారెంట్‌ల నుండి ఫుడ్ సేకరించాడు, వాటిని ఎవరెవరికి అందించాడన్నది కూపీలాగుతున్నారు. 

అలాగే ఈ రెండు వారాల్లో అతడు ఇతర డెలివరీ ఏజెంట్లలో ఎవరెవరిని కలిశాడు, వారు ఇంకెవరిని కలిశారు అన్న వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. 

మరోవైపు స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్ అనే విషయం తెలియగానే హైదరాబాద్ వాసులు భయాందోళనలకు లోనయ్యారు. ఫుడ్ డెలివరీ యాప్‌లను ప్రభుత్వం అనుమతించడం కూడా మంచిది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలియక ఫుడ్ తెప్పించుకుని, డెలివరీ ఏజెంట్ల ద్వారా ఇంకెంతమంది ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడతారో అని ఆందోళన చెందుతున్నారు.