కరోనా వైరస్: లక్షణాలు ఏమిటి? గుర్తించడం ఎలా? ఇది అంత ప్రమాదకరమా?

6:16 pm, Wed, 15 April 20
what-are-the-covid19-symptoms-how-to-recognise-them

కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని కారణంగా మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 210 దేశాలకు విస్తరించింది.. విస్తరిస్తూనే ఉంది. 

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్‌ 19,96,681 మందికి సోకింది. వీరిలో 1,27,590 మంది మరణించారు. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ అక్కడ ఎంతోమందికి సోకి, మరెంతో మందిని బలిగొని, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించింది. 

అమెరికాలో ప్రస్తుతం 6,09,685 మందికి ఈ వైరస్ సోకగా, ఇప్పటి వరకూ అక్కడ వివిధ రాష్ట్రాల్లో 26,059 మంది మృత్యువాత పడ్డారు. స్పెయిన్‌లో 1,77,633 మంది దీని బారిన పడగా.. ఇప్పటి వరకు 18,579 మంది మరణించారు. 

ఇక బ్రిటన్్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య చైనాను మించిపోయింది. ప్రస్తుతం బ్రిటన్‌లో 94,845 మందికి ఈ కరోనా వైరస్ సోకగా, వీరిలో 12,129 మంది మృత్యువాత పడ్డారు.  

ఇటు భారత్‌లోనూ ఇప్పటి వరకు 11.439 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 377 మంది మరణించారు. 

కరోనా వైరస్ లక్షణాలు ఇవే…

ఈ వైరస్ ప్రధానంగా ఊపరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. జలుబు, జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస పీల్చడంలో ఇబ్బంది ఈ వైరస్ లక్షణాలు. ఈ వైరస్ సోకిన వారికి దగ్గు ఆగకుండా వస్తుంటుంది. అంటే.. సాధారణ దగ్గు కంటే తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి గంటకుపైగానే దగ్గు వస్తుంది. అలా రోజు మొత్తంమీద రెండు మూడుసార్లు సుదీర్ఘంగా దగ్గు వస్తుంది. 

జ్వరంగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారిన్ హీట్ దాటుతుంది. శరీరం బాగా వెచ్చగాకానీ లేదంటే చల్లగాకానీ ఉంటుంది. కొందరి శరీరం వణికిపోతుంటుంది. ఇంకా గొంతు కూడా మంటగా ఉంటుంది. నీళ్ల విరేచనాలు కూడా అవుతాయి. ఈ వైరస్ సోకిన వారు వాసన, రుచి గ్రహించే శక్తిని కూడా కోల్పోతారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. కరోనా వైరస్ సోకిన వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపించడానికి 14 రోజుల వరకూ సమయం పట్టవచ్చు. దీనిని ఇంక్యుబేషన్ పీరియడ్‌ అంటారు. అయితే కొందరిలో 5 రోజులకే లక్షణాలు బయటపడవచ్చు, మరికొందరికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు. 

ఇలా గుర్తించవచ్చు…

సాధారణ జలుబు, దగ్గు, జ్వరం అయితే.. పారాసిటమాల్ వంటి మాత్రలు వేసుకోవడం ద్వారా లక్షణాలు క్రమంగా తగ్గిపోతాయి. తగ్గకపోగా.. దగ్గు అధికంగా ఉండి, శ్వాస పీల్చుకోవడంలోనూ తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంటే, కొన్ని పదాలకు మించి ఎక్కువగా మాట్లాడలేకపోతుంటే మాత్రం కరోనా లక్షణాలుగా గుర్తించాలి. 

ఇలాంటప్పుడు మాత్రం వెంటనే 104, 108 వంటి ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేయాలి. ఎందుకంటే, ఈ స్థితిలో ఉన్న వారికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అవసరం అవుతుంది. ఆసుపత్రికి వెళ్లాక ఊపిరితిత్తులు ఏ మేరకు దెబ్బతిన్నాయో అక్కడి డాక్టర్లు పరీక్షించి తదనుగుణంగా ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్టుతో వైద్యం అందిస్తారు.

ఇక, తీవ్రంగా జబ్బుపడి, మీ రోజువారీ కార్యక్రమాలను కూడా చేసుకోలేకపోతున్నప్పుడు ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలను కానీ, ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్లను కానీ సంప్రదించాలి.

కోవిడ్-19 వైరస్ ఎంత ప్రమాదకరం?

కరోనా వైరస్ ప్రమాదకరమైనదే. కోవిడ్19 ఇన్ఫెక్షన్‌కు గురైన 56 వేల మందిపై డబ్ల్యూహెచ్‌వో చేసిన ఆధ్యయనం ప్రకారం.. ఈ వైరస్ కారణంగా 6 శాతం మంది రోగులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో ఊపిరితిత్తుల సమస్యలు, అవయవాలు పనిచేయకపోవడం వాటి ఫలితంగా మరణం సంభవించే అవకాశం అధికంగా ఉంటుంది. 

ఇక ఈ వైరస్ బారిన పడిన 14 శాతం మందిలో శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర సమస్య ఏర్పడింది. 80 శాతం మందిలో మాత్రం ప్రాథమిక లక్షణాలు అంటే.. జలుబు, దగ్గు, జ్వరం వంటివి కనిపించాయి. ఇవి న్యుమోనియాలోకి కూడా దించవచ్చు.