ఆదర్శనీయం: రూ.36 వేలతోనే ఐఏఎస్ అధికారి కుమారుడి వివాహం! కూతురి పెళ్లికి అందులో సగమే…

wedding
- Advertisement -

ias

విశాఖపట్నం: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో వివాహం అంటే.. లక్షల్లో ఖర్చులు పెట్టి భారీ ఏర్పాట్లతో ఘనంగా నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో సాధారణ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు పెళ్లి ఖర్చులకు వెనుకాడటం లేదు. కానీ, ఓ ఐఏఎస్ అధికారి మాత్రం తన కుమారుడి వివాహాన్ని కేవలం రూ.36 వేలతోనే జరిపిస్తుండటం విశేషం.

వివరాల్లోకి వెళితే.. విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి మండలి (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ పట్నాల బసంత్‌కుమార్‌ మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచిస్తారు. కాగా, బసంత్ కుమార్ కుమారుడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 10న విశాఖలోని దయాల్‌నగర్‌లో సత్సంగ్ ఆధ్వర్యంలో వివాహం జరగనుంది.

కుమార్తె వివాహానికి రూ.16 వేలే…

అయితే పెళ్లి కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా.. సింపుల్‌గా కానిచ్చేయాలని బసంత్ నిర్ణయించారు. మొత్తం రూ.36వేలతో పెళ్లి పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం అమ్మాయి తరుపువారు, అబ్బాయి తరుపువారు చెరో రూ.18వేలు భరించనున్నారు. ఫిబ్రవరి 8న నూతన వధూవరుల ఆశీర్వాద కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నర్సింహన్ దంపతులు హాజరవుతున్నారు.

సాదాసీదా కుటుంబాలే ఈరోజుల్లో ఆడంబరంగా పెళ్లిళ్లు జరిపిస్తుంటే.. ఓ ఐఏఎస్ అయి ఉండి తన కుమారుడి పెళ్లిని ఇంత సింపుల్‌గా పెళ్లి జరిపిస్తుండటంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు. కాగా, గతంలో ఇదే ఐఏఎస్ అధికారి తన కుమార్తె వివాహాన్ని కేవలం రూ.16,100 ఖర్చుతోనే జరిపించడం విశేషం.

- Advertisement -