వీధులు ఊడ్చాడు.. లగ్జరీ కారు బహుమతిగా పొందాడు

4:31 pm, Sun, 7 June 20

వాషింగ్టన్: నిరసనల్లో పాలు పంచుకులేదు.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయలేదు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో పాల్గొనలేదు.

కానీ అతడు చేసిన పనికి నల్లజాతీయులే కాదు, స్థానికంగా ఉన్న తెల్లజాతీయులు కూడా ఫిదా అయ్యారు. అతడికి భారీ బహుమతులిచ్చి సత్కరించారు.

జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ 18 ఏళ్ల యువకుడు చేసిన పని ప్రధానంగా వార్తల్లో నిలిచింది.

అతడికి ఊహించని గుర్తింపు తీసుకురావడంతో పాటు అనేక బహుమతులను తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే..

ఆంటోనియో గ్విన్ జూనియర్ అనే 18 సంవత్సరాల నల్లజాతి యువకుడు స్థానిక బెయిలీ ఎవెన్యూలోని బఫెల్లో ప్రాతంలో నివశిస్తున్నాడు.

ఇటీవలే అక్కడ పోలీసులకు, నిరసనకారులకు మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు బాంబులు వేసుకున్నారు, చుట్టుపక్కల వస్తువులను ధ్వంసం చేశారు.

దీంతో ఆ ప్రాంతమంతా చెత్తా, చెదారంతో నిండిపోయింది. ఇది చూసిన ఆంటోనియో దానిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు.

మధ్యామ్నం 2 గంటలకు మొదలుపెట్టి దాదాపు 10 గంటలపాటు నిర్విరామంగా ఆ వ్యర్థాలన్నింటినీ శుభ్రం చేసేశాడు.

ఈ విషయాన్ని అక్కడి ఓ వార్తా సంస్థ ప్రముఖంగా ప్రచురించింది. ఈ నేపథ్యంలో విషయం చుట్టుపక్కలవారికి చేరింది. అతడు చేసిన పనిని వారంతా ఎంతో ముక్తకంఠంతో మెచ్చుకున్నారు.

మ్యాట్ బ్లాక్ అనే స్థానిక వ్యక్తి మరొక అడుగు ముందుకేసి తన 2004 లగ్జరీ మోడల్ టాప్‌లెస్ మస్టంగ్ కారును ఆంటోనియోకు బహుమతిగా ఇచ్చాడు.

ఇక మరో వ్యాపారి ఆ కారుకు ఏడాదిపాటు ఇన్స్యూరెన్స్ ఇచ్చాడు. బఫెల్లోలోని ఓ కళాశాల అయితే ఆంటోనియోకు ఏకంగా తదుపరి చదువుకు కావలసిన పూర్తి స్కాలర్‌షిప్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఊహించని విధంగా తనకు ఇన్ని బహుమతులు అందడంతో ఆంటోనియో తెగ సంతోషపడిపోతున్నాడు. తానకు తన ప్రాంతమంటే ఎంతో ఇష్టమని, అందుకే వీధుల్లో చెత్తను తొలగించాలనుకున్నానని చెప్పాడు. అయితే ఈ స్థాయిలో తనకు గుర్తింపు వసతుందని ఊహించలదేని చెప్పుకొచ్చాడు.