అమెరికాలో 20లక్షల కరోనా వ్యాక్సిన్లు రెడీ.. ప్రకటించిన ట్రంప్

7:59 pm, Sat, 6 June 20

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్లను తయారు చేయడంలో ప్రపంచ దేశాలన్నీ తలమునకలవుతున్న విషయం తెలిసిందే.

అమెరికా, భారత్, చైనా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలతో పాటు మరికొన్ని దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు పగలూ రాత్రీ తేడా లేకుండా శ్రమిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలన ప్రకటన చేశారు. అమెరికా కరోనా వ్యాక్సిన్లను తయారుచేసేసిందని, ఇప్పటికే 20 లక్షల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని మీడియా సాక్షిగా ప్రకటించారు.

ఇటీవల ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్, అమెరికాలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించి వివరాలను వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్లపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు.

ఆ పరిశోధనల్లో భాగంగా తమ శాస్తవేత్తలు ఇప్పటికే 20 లక్షల వ్యాక్సిన్ డోసులను తయారు చేసినట్లు ఆయన తెలిపారు.

ఆ వ్యాక్సిన్ల పనితీరుపై శాస్త్రవేత్తల రిపోర్టులు రావడమే ఆలస్యమని, అవి రాగానే వ్యాక్సిన్లను వినియోగంలోని తీసుకొస్తామని ట్రంప్ తెలిపారు.

కరోనా వ్యాక్సిన్లను తయారు చేయడంలో అమెరికన్ శాస్త్రవేత్తలు గొప్పగా పనిచేశారని, వారి కృషి వల్లనే వ్యాక్సిన్ సిద్ధమైందని ట్రంప్ ప్రశంశించారు.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 19 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో లక్షమందికి పైగా మరణించారు.

ఈ నేపథ్యంలో తమ దేశంలో కరోనా వ్యక్సిన్లు ఉన్నాయంటూ ట్రంప్ ప్రకటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

కరోనా వ్యాక్సిన్లను తయారు చేయడంలో నిజంగా అమెరికా విజయం సాధించి ఉంటే అది ప్రపంచానికే మేలని అనేకమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కానీ మరికొందరు మాత్రం కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం అంత సులువేమీ కాదని, పూర్తిగా తయారయి బయటకు వస్తే కానీ దానిని పరిగణలోకి తీసుకోకూడదని చెబుతున్నారు.