భారత్ తరుపున ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకి దిగొచ్చిన పాక్!

10:27 am, Sat, 23 March 19
America Latest News, Pakistan Latest News, Imran Khan News, Newsxpressonline

అమెరికా: అమెరికా ఇచ్చిన వార్నింగ్ దెబ్బకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి దిగివచ్చింది. ఇంకోసారి ఉగ్రవాద చర్యలతో భారత్‌ను ఇబ్బంది పెడితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైట్ హౌస్ నుంచి అధికార ప్రకటన వెలువడింది.

ఈ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తెరపైకి వచ్చేశారు.  తమ దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచేయడానికి అన్ని శక్తులు ఉపయోగిస్తున్నామంటూ అత్యవసర ప్రకటన చేశారు. పాకిస్తాన్ నేలపై ఇక నుంచి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు తావుండదని ఆయన ప్రకటించారు.

ఇస్లామాబాద్‌లో వివిధ పత్రికలు, టెలివిజన్ ఛానళ్ల ఎడిటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

‘‘పాకిస్తాన్‌లో ఇకపై జిహాదీ గ్రూపులు ఉండవు..’’

అంతేకాదు పాకిస్తాన్‌లో మిలిటెంట్ గ్రూపులను నిర్మూలించేందుకు, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఒకటి రూపొందిస్తున్నామని కూడా ఇమ్రాన్ తెలిపారు. అలాగే పాకిస్తాన్‌లో ఇకపై జిహాదీ గ్రూపులు ఉండవని, జిహాదిజం అనే పదం ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారిందని, దీనిని నిర్మూలించేందుకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

అలాగే భారత్ తన పలుకుబడితో పాకిస్తాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించే ప్రయత్నాలు మానుకోవాలని కూడా ఇమ్రాన్ ఖాన్ కోరారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటీఎఫ్) పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో పెట్టడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారే ప్రమాదంలో పడనుందని ఆయన తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు.

అయితే, ఈ పరిస్థితి నుంచి తమ దేశం బయటపడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని ఇమ్రాన్ తెలిపారు. పుల్వామా ఘటన అనంతరం భారత్ తెస్తున్న అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా అటు చైనా కూడా పాకిస్తాన్‌ను కాపాడలేమని చేతులెత్తేస్తోంది.

ఈ నేపథ్యంలో శరణమే గతి అని అర్థమై పాకిస్తాన్ సంధికి దిగుతోంది. అటు అంతర్జాతీయ సమాజంలో ఒంటరి అవ్వడం, మరోవైపు ఆర్థిక ఆంక్షలు విధించడం, చిరకాల మిత్రుడు చైనా కూడా చేతులెత్తేయడంతో.. ఏం చేయలేక పాకిస్తాన్ ఇలా కాళ్లబేరానికి వచ్చిందని.. ఇది భారత్ దౌత్య విజయమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.