అమెరికాలో నిమిషానికి 43 కొత్త కేసులు.. తలసరి కేసుల్లో రెండోస్థానం

- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్టపడడం లేదు. నిమిష నిమిషానికి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ప్రతీ గంటలకు 2,600 కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. 

అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4 మిలియన్లకు చేరువైంది. అమెరికాలో జనవరిలో తొలి కేసు నమోదైంది.

- Advertisement -

ఆ తర్వాత 98 రోజుల్లోనే కేసుల సంఖ్య మిలియన్‌కు చేరుకోగా,  43 రోజుల్లోనే 2 మిలియన్లకు, అనంతరం 27 రోజుల్లోనే మూడు మిలియన్లకు కేసులు చేరుకున్నాయి.

ఇప్పుడు మరో 16 రోజుల్లోనే ఏకంగా 4 మిలియన్లకు చేరువైంది. అంటే అక్కడ ప్రతీ నిమిషం కొత్తగా 43 కేసులు వెలుగు చూస్తున్నాయి.

నిన్నమొన్నటి వరకు మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా కనిపించిన ట్రంప్ ఇప్పుడు ముఖానికి మాస్క్‌తోనే కనిపిస్తున్నారు. ఫలితంగా మాస్కులు ధరించేలా అమెరికన్లను ప్రోత్సహిస్తున్నారు.

ప్రపంచంలో కేసులు అత్యధికంగా నమోదవుతున్న తొలి 20 దేశాల్లో తలసరి కేసుల విషయంలో అమెరికా రెండోస్థానంలో ఉంది.

ఇక్కడ ప్రతీ 10 వేల మందిలో 120 మంది వైరస్‌ బారినపడుతున్నారు. ఫలితంగా చిలీని దాటిపోయింది.

అలాగే, తలసరి మరణాల్లో యూకే, స్పెయిన్, ఇటలీ, చిలీ, ఫ్రాన్స్‌లను దాటేసిన అమెరికా ఆరోస్థానంలో నిలిచింది.

ఇక్కడ ప్రతీ 10 వేల మందికి 4.4 మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 1.43 లక్షల మంది మృత్యువాత పడ్డారు.

- Advertisement -