షాకింగ్: వారు మరణిస్తుంటే చూడడం ఓ అద్భుతమే: మళ్లీ నోరు జారిన ట్రంప్…

1:43 pm, Sat, 16 May 20

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఒక్కోసారి తీవ్రంగా వికటిస్తున్నా.. ఆయనలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా ట్రంప్‌ మరోసారి నోరు జారారు.

గతంలో కరోనా వైరస్‌ను చంపేందుకు రోగులకు క్రిమి సంహారకాలను ఎక్కించేద్దాం.. శరీరంలోకి అతినీల లోహిత కిరణాలను పంపించేద్దాం.. అంటూ ఆయన చిత్రవిచిత్ర వ్యాఖ్యలు చేశారు.

ఈసారి కరోనా రోగులకు ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తోన్న వైద్యుల గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ పొరపాటున మాట తూలారు.

ఈ కార్యక్రమంలో ట్రంప్ కనీసం ముక్కుకు మాస్క్ కూడా ధరించలేదు. పైగా తన ప్రసంగంలో.. ‘వారు చనిపోతుంటే చూసేందుకు అద్భుతంగా ఉంటుంది..’ అంటూ వ్యాఖ్యానించి యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా చేశారు అధ్యక్షులవారు. 

అసలేం జరిగిందంటే..

అమెరికాలోని పెన్సిల్వేనియాలో శుక్రవారం వైద్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడారు.

‘‘పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆరోగ్య సిబ్బంది యుద్ధ వీరులు. యుద్ధంలో పోరాడుతూ బుల్లెట్లకు ఎదురొడ్డి మరణించే సైనికుల తరహాలోనే కరోనాపై సమరంలో వైద్యులు, నర్సులు ప్రాణాలు కోల్పోతున్నారు..’’ అంటూ అద్భుతంగా మాట్లాడారు.

అంతటితో ఊరుకుంటే పోయేది, కానీ అలా ఊరకే ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకవుతారు?

‘‘వైద్యులు, నర్సులు ప్రాణాలు కోల్పోవడం నమ్మశక్యం కానిది. అయితే చూసేందుకు అద్భుతంగా (ఇట్స్‌ ఏ బ్యూటిఫుల్‌ థింగ్‌ టు సీ) ఉంటుంది..’’ అంటూ నోరుజారారు. ఇంకేముంది అక్కడున్న వాళ్లందరూ ముక్కున వేలేసుకున్నారు.

ఎంతమంది ఎన్నిసార్లు ముక్కున వేలేసుకుంటున్నా అధ్యక్షుల వారిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఆయన పాండిత్యం జోరూ తగ్గడం లేదు.. హతవిధీ!