న్యూయార్క్: అమెరికాలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి చెందారు. ఇదాహో రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన. విమానయాన అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.
విమానాలు రెండూ గాల్లో ఢీకొని సరస్సులో మునిగిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సరస్సులో మునిగిపోతున్న విమానాల నుంచి రెండు మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు.
అప్పటికే మరో ఆరుగురు సరస్సులో మునిగిపోవడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి.
మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బోట్ల సాయంతో స్థానికులు రెండు మృతదేహలను వెలికితీశారు. మిగిలిన ఆరుగురి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.
సరస్సులో 127 అడుగుల లోతున విమానాల శకలాలు పడి ఉన్నాయని, వాటిని వెలికితీయడానికి మరిన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.