విచిత్రం: ఓ బిడ్డకు జన్మనిచ్చిన నెలకే మళ్లీ ప్రసవం.. ఈసారి కవలలు!

5:42 pm, Thu, 28 March 19
bangladeshi woman Latest News, Twins Latest News, Newsxpressonline

ఢాకా: ప్రపంచంలో అప్పుడప్పుడూ వింతలు జరుగుతూ ఉంటాయి. తాజాగా, బంగ్లాదేశ్‌కు చెందిన ఓ 20 ఏళ్ల వివాహితకు నెల రోజుల్లోనే రెండుసార్లు ప్రసవం చేసిన వైద్యులు అద్భుతమంటూ ఆశ్చర్యానికి గురయ్యారు.

తొలి ప్రసవంలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నెల రోజులకే మరో ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. దీంతో ఆమెకు డెలివరీ చేసిన వైద్యులు ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

26 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు డెలివరీ..

ఆ వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లోని నైరుతి ప్రాంతంలోని జస్సోర్‌ జిల్లాకు చెందిన వివాహిత కొన్ని రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. అయితే 26 రోజుల తర్వాత మళ్లీ నొప్పులు రావడంతో ఆస్పత్రికి రాగా.. వైద్యులు ఆమెను పరీక్షించారు. దీంతో ఆమె గర్భంలో మరో ఇద్దరు శిశువులు ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు.

వెంటనే సిజేరియన్‌ నిర్వహించి కవలల(అమ్మాయి, అబ్బాయి)ను బయటికి తీశారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని, రెండ్రోజుల క్రితమే వాళ్లను డిశ్చార్జ్‌ చేశామని వైద్యులు తెలిపారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ విషయం గురించి జెస్సోర్‌ ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ దిలీప్‌ రాయ్‌ మాట్లాడుతూ.. ‘ నా 30 ఏళ్ల మెడికల్‌ సర్వీసులో ఇలాంటి అద్భుత ఘటన చూడలేదు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటం సంతోషకరం. అయితే మొదటిసారి డెలివరీ చేసినపుడు ఈ విషయాన్ని గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖుల్నా ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

ఇది ఇలా ఉండగా, ముగ్గురు పిల్లలు కలగడం సంతోషంగా ఉన్నా.. వారినెలా పెంచి పెద్దచేయాలో అర్థం కావడం లేదంటూ సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

తన భర్త రోజూవారీ కూలీ అని.. నెలకు కేవలం 1200 రూపాయలు మాత్రమే సంపాదిస్తాడని తెలిపింది. ‘అల్లా దయ వల్ల నా పిల్లలు క్షేమంగా ఉన్నారు. వారిని సంతోషంగా ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా..’ అంటూ ఆమె భర్త చెప్పుకొచ్చాడు.