షాకింగ్: నదిలో ల్యాండైన విమానం! త్రుటిలో ప్రమాదం తప్పించుకున్న136 మంది…

12:53 pm, Sat, 4 May 19

ఫ్లోరిడా: అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి 136 మంది ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారు. ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లే విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. క్యూబా నుంచి ఫ్లోరిడా వస్తున్న బోయింగ్ 737 విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు పక్కనున్న సెయింట్ జాన్స్ నదిలోకి వెళ్లిపోయింది.

ఆ సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. అందరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ కొందరు ప్రయాణికులకు మాత్రం గాయాలయ్యాయి.

విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పుతున్నట్టు గుర్తించిన పైలట్ క్షణాల్లోనే దానిని నదిలోకి మళ్లించాడు. విమానం నీటిలో పూర్తిగా మునగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.