కరోనాను బూచిగా చూపి సరిహద్దుల్లో చైనా చిందులు: అమెరికా

8:25 pm, Sat, 6 June 20

వాషింగ్టన్: భారత సరిహద్దులోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం చైనా సైనికులను మొహరిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లోని లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి పలు ప్రాంతాలను ఆక్రమించుకోవడమే ధ్యేయంగా చైనా బలగాలు ముందుకొస్తున్నాయి.

దీనికి ప్రతిగా భారత్ కూడా సైన్యాన్ని సరిహద్దుల్లోకి పంపుతోంది. ఇదిలా ఉంటే చైనా సరిహద్దు వివాదాలు భారత్‌వరకు పరిమితమై ఉన్నాయనుకుంటే పొరపాటే.

చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతోనూ చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. భూ భాగాన్నే కాదు, సముద్రాన్ని కూడా చైనా వదిలిపెట్టడం లేదంటే అర్థం చేసుకోండి.

ఈ నేపథ్యంలో చైనాకు ఊహించని షాక్ తగిలింది. జపాన్‌ ఆధీనంలోని సముద్ర జలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న చైనాపై అక్కడి అమెరికా దళాల లెఫ్టనెంట్ జనరల్ కెవిన్ స్చ్‌నెయిడర్ మంది పడ్డారు.

సరిహద్దు దేశాల్లోని ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తోందని, కరోనాను అడ్డుపెట్టుకుని దురాక్రమణకు పూనుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో ఓడలను తిప్పుతూ పక్క దేశాల జలాలను కూడా ఆక్రమిస్తోందని ఆరోపించారు.

అంతేకాకుండా తూర్పు చైనా సముద్రంలో కూడా ఆ దేశం దురాక్రమణలకు పాల్పడుతోందని పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో జపాన్‌తో చైనాకు ఎప్పటినుంచో సరిహద్దు వివాదం కొనసాగుతోందని, ఇప్పుడు ఆ ప్రాంతాలను ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.