డేంజర్ బెల్స్: చైనాలో 50 వేలకు చేరిన ‘కరోనా’ బాధితులు, ఒకేరోజు 14 వేల మందికిపైగా…

6:37 pm, Thu, 13 February 20
china-hubei-province-coronovirus

బీజింగ్: చైనాలో ‘కరోనా’ వైరస్ బాధితుల సంఖ్య వేగంగా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా వీరి సంఖ్య దాదాపు 50 వేలకు పెరిగినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. ఒక్క హుబే ప్రావిన్స్‌లో.. ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో.. బుధవారం ఒక్కరోజే దాదాపు 242 మంది మరణించినట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ కారణంగా చైనాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ఇళ్లల్లో బందీలుగా మారారు. గడపదాటి బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. మరోవైపు ఈ వైరస్ బారిన పడి మరణించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకే రోజు 14 వేల 840 కరోనా కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చైనాలోని పలు రంగాల్లో కార్యకలాపాలు స్థంభించాయి. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అత్యంత త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండడంతో చైనాలో విద్యాసంస్థలతో పాటు కార్యాలయాలకూ సెలవులు ప్రకటించారు.

‘కోవిడ్-19’గా నామకరణం…

కరోనా వైరస్‌కు ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కోవిడ్-19’ అని పేరు పెట్టింది. దీనిని కరోనా వైరస్ డిసీజ్ 2019 అని పిలవాలని పేర్కొంది. 2019 చివర్లో ఈ వైరస్ మొదలు కావడంతో.. సీవోఐడీ-19 అని దీనికి నామకరణం చేశారు.   

చైనాలో రోజురోజూకీ విస్తరిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం ఆ దేశానికి సమీపంలో ఉన్న దేశాలపై కూడా బలంగానే ఉంది. ఇప్పటి వరకు ఈ వైరస్ భారత్ సహా మరో 20 దేశాలకు విస్తరించింది.

ఈ వైరస్ సోకిన రోగులు ఎవరు? వ్యాధి సోకని వారు ఎవరో తెలియకుండా పోతోంది. జలుబు చేసినా, జ్వరం వచ్చినా, ఎవరైనా దగ్గుతూ కనిపించినా.. వారు కరోనా బాధితులేమో అని అనుమానించే పరిస్థితి వచ్చింది. 

కరోనా దెబ్బతో ఇప్పటికే చైనాలో పరిశ్రమలతో పాటు పర్యాటక రంగం కూడా నెమ్మదించింది. చైనాకు వెళ్లిన పర్యాటకులు తిరిగి తమ దేశాల్లోకి రాకుండా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి.