గ్రేట్: చరిత్ర సృష్టించిన చైనా, చంద్రుడి వెనుకవైపు దిగిన చాంగె-4 ప్రోబ్, తొలి ఫోటో విడుదల…

china-releases-moon-back-side-image
- Advertisement -

china-releases-moon-back-side-image

బీజింగ్: చైనా చరిత్ర సృష్టించింది. అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశమూ చేయలేని పని చైనా చేసి చూపించింది. చంద్రుడి చీకటి భాగంలో రోవర్‌ను విజయవంతంగా దింపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా చైనీస్ స్టేట్ మీడియా గురువారం విడుదల చేసింది. ప్రయోగం విజయవంతం కావడంతో చైనా శాస్త్రవేత్తలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ శుభాకాంక్షలు తెలిపింది.

చదవండి: చంద్రుడి చీకటి భాగంలో ఏముంది? గుట్టు లాగేందుకు చైనా ‘చాంగె-4’ రోవర్ ప్రయోగం…

భూమి ఎలాగైతే తన కక్షలో తిరుగుతుందో, అలాగే చంద్రుడు కూడా భూమి చుట్టూ తన కక్ష్యలో తాను తిరుగుతుంటాడు. అందువల్ల చంద్రుడు ఎప్పుడూ ఒకేవైపునే కనిపిస్తాడు. ఇప్పటి వరకు చంద్రుడి అవతలివైపు భాగంలో ఏ దేశ వ్యోమనౌక సురక్షితంగా దిగలేదు. అందువల్ల ఆ ప్రాంతంలో పరిశోధనలు సాధ్యం కాలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారి చైనా వ్యోమనౌక దిగింది.

ఆ చీకటి భాగంలో ఏముందో…

భూమి నుంచి చూసే మనకు ఎప్పుడూ చంద్రుడిలో సగభాగమే కనిపిస్తుంది. మిగతా సగభాగం చీకటిలోనే ఉంటుంది. ఆ చీకటి భాగంలో ఏముందో తెలుసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. అయితే ఈ విషయంలో చైనా విజయం సాధించింది. చంద్రుడి చీకటి భాగంలో గుట్టుమట్లు తెలుసుకునేందుకు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) చాంగె-4 పేరుతో ఒక వ్యోమనౌకను చంద్రుడిపైకి ప్రయోగించింది.

చదవండి: అద్భుతం: ఏడు నెలలు ప్రయాణించి.. అంగారకుడిపై విజయవంతంగా దిగిన నాసా ‘ఇన్‌సైట్’…

లాంగ్ మార్చ్ 3బీ రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈ వ్యోమనౌకలో ఒక ల్యాండర్, రోవర్ ఉన్నాయి. డిసెంబర్ 8న బయలుదేరిన ఈ వ్యోమనౌక ఇన్నిరోజులూ అంతరిక్షంలో ప్రయోగించి గురువారమే.. అంటే జనవరి 3, 2019న చంద్రుడి చీకటి భాగంలో విజయవంతంగా దిగింది.

స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10.26 గంటల ప్రాంతంలో చంద్రుడి చీకటి భాగంలో నిర్దేశిత ప్రాంతంలో దిగిన రోవర్.. వెనువెంటనే ఆ ప్రదేశాన్ని ఫొటోలు తీసి వాటిని భూమ్మీదికి పంపించింది. ఆ ఫొటోలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్‌ మీడియాకు విడుదల చేసింది.

చైనా సాధించిన ఈ విజయాన్ని అంతరిక్ష పరిశోధనా రంగంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు చాంగె-4 లూనార్ మిషన్ చీఫ్ డిజైనర్ వు వీరెన్. బలమైన స్పేస్ నేషన్ వైపుగా చైనా అడుగులు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

2004 నుంచీ…

చంద్రుడిపై పరిశోధనలకు 2004లో చైనా లూనార్ మిషన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు నాలుగు ప్రయోగాలు చేపట్టింది. చాంగె-4 నాలుగోది. ఇందులో 1088 కిలోల బరువైన ల్యాండర్, 136 కిలోల బరువైన రోవర్ ఉన్నాయి. ఈ లూనార్ ప్రోబ్‌ను భూమితో అనుసంధానించడానికి గతేడాది మే నెలలోనే చైనా క్వెకియావో అనే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించింది.

- Advertisement -