బిగ్ రిలీఫ్! ఫలితమిస్తున్న చైనా తయారీ వ్యాక్సిన్.. విదేశాల్లో ట్రయల్స్‌కు రెడీ

5:00 pm, Tue, 31 March 20

బీజింగ్: కరోనా వైరస్ కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్న ప్రపంచానికి ఇది గొప్ప శుభవార్తే. కోవిడ్ మహమ్మారిని అడ్డుకునేందుకు చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ఫలితాలు చూపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌ను విదేశాల్లోనూ పరీక్షించాలని చైనా యోచిస్తోంది.

కరోనా వైరస్ వెలుగుచూసిన వూహాన్‌లో ఈ వ్యాక్సిన్‌కు ప్రస్తుతం నిర్వహిస్తున్న ట్రయల్స్ పూర్తిగా సురక్షితమని తేలడమే కాకుండా, విజయవంతం కావడంతో ఇకపై వీటిని విదేశాల్లోనూ పరీక్షించాలని యోచిస్తున్నట్టు చైనా పరిశోధకులు తెలిపారు.

ప్రభుత్వ అనుమతితో మార్చి 16న ఈ వ్యాక్సిన్‌‌కు తొలిదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇది సజావుగా సాగుతోందని, దీని ఫలితాలు ఏప్రిల్‌లో పబ్లిష్ చేస్తామని చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ సభ్యురాలు చెన్ వీ తెలిపారు.

చైనాలో ఉన్న విదేశీయులపైనా దీనిని ప్రయోగిస్తామని ఆమె వివరించారు. వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ అక్కడ రెండు నెలలపాటు ప్రజలను వణికించింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.

‘‘ప్రారంభ ఫలితాలు టీకా సురక్షితమని నిరూపిస్తే, అవసరమైన ప్రభావాన్ని చూపిస్తే, అంతర్జాతీయ సహకారంతో దానిని విదేశాల్లోనూ పరీక్షిస్తాం’’ అని చెన్‌ను ఉటంకిస్తూ ప్రభుత్వ దినపత్రిక మంగళవారం తెలిపింది.

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఇతర బాధిత దేశాల్లోనూ ఈ టీకాను వాడొచ్చని అకాడమీ ఆఫ్ మిలిటరీ సైన్సెస్ పరిశోధకురాలు కూడా అయిన చెన్ పేర్కొన్నారు.

చాలా దేశాలు ఈ వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. అంటు వ్యాధుల వ్యాక్సిన్ల అభివృద్ధిలో అంతర్జాతీయంగా సహకరించేందుకు తాను, తన బృంద సభ్యులు సిద్ధంగా ఉన్నట్టు చెన్ తెలిపారు.