ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలు దాటిన కరోనా కేసులు.. 39 వేలు దాటిన మరణాలు

7:42 pm, Tue, 31 March 20

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 8 లక్షలు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఒక్క అమెరికాలోనే ఏకంగా 1,64,435 కేసులు నమోదయ్యాయి. ఇటలీలోనూ ఈ సంఖ్య లక్ష దాటింది. స్పెయిన్‌లో 94వేలు, చైనాలో 81వేలు, జర్మనీలో 64 వేల కేసులు నమోదయ్యాయి.

యూరప్ దేశాలను వైరస్ వణికిస్తోంది. ఇక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. మరణాలు కూడా అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 39,032 మంది మరణించారు.

ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, మనదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 1454 కరోనా కేసులు నమోదు కాగా, 142 మంది కోలుకున్నారు. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.