డేంజర్ బెల్స్: ‘కరోనా’లోనూ అగ్ర స్థానమే… అమెరికాలో లక్ష దాటిన పాజిటివ్ కేసులు!

2:44 pm, Sat, 28 March 20
corona-positive-cases-cross-one-lakh-in-us

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్(కోవిడ్ 19) పాజిటివ్ కేసుల విషయంలోనూ అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది. కరోనా మహమ్మారికి అక్కడ అడ్డుకట్ట అనేదే లేకుండా పోయింది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.

శుక్రవారం నాటికి చైనా, ఇటలీ దేశాలను దాటవేసి అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశంగా అమెరికా తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షను దాటింది. 

చదవండి: చిన్న దేశం.. వైద్య సౌకర్యాలూ అంతంతమాత్రం.. కానీ ‘కరోనా’పై గెలుపు సాధించింది!

ఇప్పటి వరకు ఏ దేశంలోనూ లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు దాఖలాలు లేవు. అంతేకాదు, అమెరికాలో ఇప్పటి వరకు 1500 వందల మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను రూపుమాపేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటోందని పునరుద్ఘాటించారు. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికీ చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఒక్కో కుటుంబానికి 3400 డాలర్ల సాయం…

కరోనా వైరస్ ప్రభావం కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దిగజారిపోతున్న నేపథ్యంలో ఆయా దేశాలు అనేక ఉద్దీపన పథకాలను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంది. 

దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో ఆ ప్రతికూల ప్రభావం బారినుంచి దేశ ప్రజలు, వ్యాపార వర్గాలకు ఊరట కల్పించేందుకు ట్రంప్ ప్రభుత్వం 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

ఈ చట్టానికి సంబంధించిన దస్త్రంపై దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. దీని వల్ల ఆ దేశంలో నివసిస్తోన్న ప్రతి కుటుంబానికి 3400 డాలర్ల ఆర్థికసాయం దక్కుతుంది. 

corona-virus-us-president-trump-speachఅమలులోకి ‘డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్’…

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే అన్ని రకాల మార్గాలను అన్వేషించి ఆచరణలోకి తీసుకొచ్చిన శ్వేతసౌధం.. చివరి అస్త్రాల్లో ఒకటైన ‘డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్’ని కూడా అమలులోకి తీసుకొచ్చింది.

అమెరికాలో అత్యంత అరుదుగా ప్రయోగించే ఈ చట్టాన్ని తాజాగా తక్షణమే అమలులోకి తీసుకొచ్చారంటే కరోనా నేపథ్యంలో ఆ దేశ పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుంది. 

కరోనాను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా ఆసుపత్రులు నిర్మించేందుకు సైన్యంలోని ఇంజనీర్ల బృందాన్ని కూడా దేశాధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దింపారు.

అంతేకాదు, డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలతో ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్‌ను.. ఆపత్కాలంలో రోగులకు ఊపిరి అందించేందుకు ఉపయోగించే వెంటిలేటర్ల ను తయారు చేయాల్సిందిగా కూడా ఆదేశించారు. 

మరోవైపు ఫిలిప్స్, మెడ్‌ట్రోనిక్, హామిల్టన్, జోల్, రెడ్‌మెడ్ వంటి సంస్థలతోనూ ట్రంప్ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే వారం రోజుల్లో లక్ష వెంటిలేటర్లను తయారు చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు.

ట్రంప్ సర్కారుకు కార్పొరేట్ల సహకారం…

మరోవైపు కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వానికి తమ తోడ్పాటును అందించేందుకు అమెరికాలోని కార్పొరేట్ సంస్థలు కూడా నడుంబిగించాయి. ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న వైద్య సిబ్బందికి ఫేస్ మాస్క్‌లు అందించేందుకు ముందుకొచ్చింది.

అలాగే దేశ వ్యాప్తంగా వైద్య సామగ్రి, మందుల పంపిణీ కోసం తమ వద్ద ఉన్న అతి పెద్ద కార్గో విమానం ‘డ్రీమ్ లిఫ్టర్’ను ఇచ్చేందుకు కూడా అంగీకరించింది. దాదాపు 63 వేల పౌండ్ల బరువును మోయగలిగే మూడు విమానాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 

ప్రముఖ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ యాపిల్ కూడా సీడీసీ, ఫెమాల భాగస్వామ్యంతో కరోనా వైరస్ కట్టడికి ఉపయోగపడే కొత్త టూల్‌ను అందుబాటులోనికి తీసుకొచ్చింది. 

చదవండి: కరోనా ఎఫెక్ట్: వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు.. బీఎస్ఎన్ఎల్, జియో నుంచి భలే ఆఫర్లు…