ప్రపంచాన్ని కబళిస్తున్న కోవిడ్ భూతం.. 3 వేలు దాటిన మరణాలు

1:06 pm, Mon, 2 March 20
coronavirus-outbreak-in-china

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) శరవేగంగా విస్తరిస్తోంది. చైనా వెలుపల కూడా వైరస్‌ సోకడంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. 70 దేశాలకు పైగా విస్తరించిన ఈ మహమ్మారి కారణంగా సోమవారం వరకు సుమారు 3 వేల మంది మృతి చెందారు.

 

ఒక్క చైనాలోనే ఇప్పటి వరకు 2,912 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 80వేలు దాటింది. చైనా తర్వాత అత్యధిక కరోనా కేసులు ఇరాన్‌, దక్షిణ కొరియాలో నమోదయ్యాయి. ఇరాన్‌లో తాజాగా 11 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 54కు చేరింది.

 

కరోనా వైరస్‌ సోకిన వారిలో 60 ఏళ్లు దాటిన వారు, హైపర్‌ టెన్షన్‌ ఉన్నవారే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చాలా దేశాల్లో తొలి కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు ట్రావెల్‌ బ్యాన్‌ విధించాయి. చాలా దేశాలు ఇప్పటికే చైనాకు రాకపోకలను నిషేధించాయి.