‘కోవిడ్’ తగ్గుతోంది.. చైనా వైద్యుల ఊరట ప్రకటన

12:32 pm, Thu, 13 February 20

బీజింగ్: చైనా వైద్యులు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. కోవిడ్-2019 కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు ప్రకటించారు. జనవరి తర్వాత తొలిసారి కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టినట్టు చెప్పిన వైద్యులు.. ఏప్రిల్ చివరినాటికి కోవిడ్ ప్రభావం పూర్తిగా మాయమవుతుందని తెలిపారు.

 

ఈ ప్రకటన అంతర్జాతీయ నిపుణులను మెప్పించలేకపోతోంది. కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ వచ్చేందుకు మరో 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వైరస్‌ను నంబర్ వన్ ప్రజాశత్రువుగా పరిగణించాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చైనా ఇలాంటి ప్రకటన చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

 

చైనాలో ఇప్పటి వరకు 44,653 కేసులు నమోదుకాగా, ఒక్క మంగళవారం నాడే 2015 కేసులు నమోదయ్యాయి. అయితే, గత నెలతో పోలిస్తే ఇవి చాలా తక్కువని, దీనిని బట్టి చూస్తే ఏప్రిల్ చివరినాటికి వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు.

 

చైనా వైద్యుల ప్రకటనపై ఆస్ట్రేలియా వైద్యులు కూడా స్పందించారు. ఈ విషయంలో ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందన్న వైద్యులు.. వైరస్ నివారణ కోసం చైనా చేస్తున్న కృషిని మాత్రం ప్రశంసించారు.