అలస్కాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

6:33 am, Thu, 23 July 20

వాషింగ్టన్: అలస్కా పీఠభూమిలో నిన్న భారీ భూకంపం సంభవించింది. ఉదయం 6:12 గంటలకు ఆంకోరేజ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్లు, పెర్రవిలేకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే గుర్తించింది.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలులపై 7.8గా నమోదైంది. అప్రమత్తమైన అధికారులు భూకంపం కేంద్రం నుంచి సుమారు 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లోని వారితోపాటు దీవుల్లో, దిగువ ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేశారు.

సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సైరన్లు మోగించి హెచ్చరికలు జారీ చేశారు. భూకంప తీవ్రత, ఇతర ప్రమాణాలను బట్టి భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రమాదరకరంగా అలలు దూసుకువచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

అయితే భూకంపం తర్వాత కూడా చాలా సేపటి వరకు అలలు సాధారణంగానే ఉండడంతో సునామీ హెచ్చరికలను ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు.