కొలంబో పేలుళ్లు: 290కి పెరిగిన మృతుల సంఖ్య.. విదేశీయుల్లో ఐదుగురు భారతీయులు…

2:14 pm, Mon, 22 April 19
colombo-bomb-blasts-victims

కొలంబో: శ్రీలంకలో పదేళ్లుగా నెలకొన్న ప్రశాంత వాతావరణంకాస్తా తాజాగా జరిగిన వరుస బాంబు పేలుళ్లతో చెదిరిపోయింది. ఆదివారం ఈస్టర్ పండుగ రోజునే కొలంబోలోని 3 చర్చిలు, మరో 3 స్టార్ హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

ఈ ఘటనలో ఇప్పటి వరకు 290 మందికిపైగా మరణించగా, 500మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మృతుల్లో ఐదుగురు భారతీయులు…

ఈ బాంబు పేలుళ్లలో శ్రీలంక జాతీయులే కాకుండా భారీ సంఖ్యలో విదేశీయులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఉగ్ర దాడిలో ఇప్పటి వరుకు 32 మంది విదేశీయులు మృతి చెందగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

రమేష్, లక్ష్మి, నారాయణ్ చంద్రశేఖర్‌ అనే వ్యక్తులు మృతి చెందినట్లు ఆదివారం సాయంత్రమే ప్రకటించగా.. తాజాగా కేజీ హనుమంతరాయప్ప, ఎం.రంగప్ప అనే వ్యక్తులు కూడా కన్నుమూశారని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ ట్వీట్ చేశారు.

దర్యాప్తు ముమ్మరం…

మరోవైపు ఈ బాంబు పేలుళ్లపై శ్రీలంక ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు శ్రీలంక పోలీసులు 24 మంది నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో13 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. మిగిలిన 11 మందిని సీఐడీ విచారిస్తోంది. వీరికి కూడా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. తొలుత రెండు చర్చిలు, రెండు హోటళ్ల వద్దే పేలుళ్లు జరిగినట్లు సమాచారం అందింది. ఆ తరువాత మొత్తం ఆరు ప్రదేశాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నట్లు గుర్తించారు.

ఇక ఎనిమిదో పేలుడు సంభవించిందని తెలియగానే వెంటనే దేశ వ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఆ తరువాత ఈ కర్ఫ్యూను ఎత్తివేసినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల కింద అన్ని కీలక ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

కొలంబోలోని ఇతర ప్రార్థనాలయాల వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. స్కూళ్లు, కాలేజీలకు అత్యవసర సెలవులు ప్రకటించడమే కాకుండా వదంతులు వ్యాపిస్తాయన్న ఉద్దేశంతో సోషల్ మీడియాపైనా నిషేధం విధించారు.

సంబంధిత వార్తలు

విషాదం: కొలంబోలో బాంబు పేలుళ్లు.. 156 మంది మృతి! ఈస్టర్ రోజునే…
శ్రీలంకలో పండుగపూట మారణహోమం….ఇది ఎవరి పని?