అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు.. వరద నీటిలో శ్వేతసౌధం!

12:31 am, Wed, 10 July 19
heavy-rains-in-america

వాషింగ్టన్ డీసీ: అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆ దేశ రాజధాని నగరం వాషింగ్టన్ డీసీతోపాటుగా పలు ఇతర నగరాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షాల కారణంగా పలు నగరాలలో జనజీవనం స్తంభించిపోయింది. 

8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఆయా నగరాల్లోని నివాస ప్రాంతాలు నీట మునిగాయి. పలు నగరాలలోని  రోడ్లు జలమయం కావడంతో.. కొన్ని ప్రాంతాల్లో కార్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో వాహనదారులు వాటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 

సోమవారం రోజున వాషింగ్టన్‌లో కురిసిన భారీ వర్షం ప్రమాదకర పరిస్ధితులను సృష్టించిందని జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. 1871లో ఒక్కసారి ఈ స్థాయి వర్షం కురిసినట్లుగా అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు నగరాలలో విమానాశ్రయాలు మూతపడ్డాయి. 

వరద నీటిలో శ్వేతసౌధం!

భారీ వర్షాలతో వరద ప్రవాహం కారణంగా వాషిగ్టన్ డీసీలోని పలు ప్రాంతాలు  అతలాకుతలం అవుతున్నాయి. ఏకంగా అధ్యక్ష నివాస భవనం అయిన శ్వేతసౌధం బేస్‌మెంట్ ప్రాంతం నీళ్లలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు వర్షపు నీటిలో చిక్కుకుపోయిన వాహనాల్లోంచి పలువురిని సహాయక బృందాలు కాపాడాయి. మొత్తం 15 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. కుండపోత వర్షాల నేపథ్యంలోనే వాషిగ్టన్ డీసీలోని మెట్రో రైల్వే స్టేషన్‌లతోపాటు ఆ ప్రాంతంలో ప్రముఖ మ్యూజియంను సైతం మూసి వేశారు.